Ola electric IPO: ఆగస్టు 1న రాబోతున్న Ola ఎలక్ట్రిక్ IPO..!
దేశీయ ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ చాలా కాలంగా ఐపీఓకు రావాలని ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ చాలా కాలంగా ఐపీఓకు రావాలని ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆగస్టు 1న ఇది ఐపీఓకు వచ్చేందుకు సిద్ధమైందని తెలుస్తుంది. ఈ ఇష్యూ ఆగస్టు 2 నుండి ఆగస్టు 6 వరకు పబ్లిక్ సబ్‌స్క్రిప్షన్ కోసం తెరిచి ఉండే అవకాశం ఉందని, అలాగే, మార్కెట్లో లిస్టింగ్ ఆగస్టు 9న జరగవచ్చని సంబంధిత వర్గాల వారు తెలిపారు. అయితే ఈ విషయంపై ఓలా ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓకు రావాలని విస్తృతంగా ఎదురుచూస్తుంది. దీని కోసం తన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP)ని డిసెంబర్ 22, 2023న మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి దాఖలు చేసింది. అప్పటి నుంచి వివిధ కారణాలతో ఐపీఓ వాయిదా పడుతూ రాగా, తాజాగా ఆగస్టు 1న వస్తుందని పరిశ్రమ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ ఐపీఓ ద్వారా ఓలా దలాల్ స్ట్రీట్‌లోకి అడుపెట్టిన మొట్టమొదటి భారతీయ ఈవీ ద్విచక్ర వాహన సంస్థగా అవతరిస్తుంది.
ఐపీఓ ద్వారా మొత్తం రూ.7,250 కోట్లు సమీకరించాలని ఓలా ఎలక్ట్రిక్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. కొత్త షేర్ల జారీ ద్వారా రూ.5,500 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ కింద 9.52 కోట్ల షేర్లను విక్రయించనుంది. ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు భవీశ్ అగర్వాల్ 47.3 మిలియన్ షేర్లను, సంస్థ ప్రారంభంలో పెట్టుబడులు పెట్టిన ఆల్ఫావేవ్, ఆల్పైన్, మ్యాట్రిక్స్ 47.89 మిలియన్ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ క్రింద విక్రయించనున్నారు. ఐపీఓ ద్వారా వచ్చిన నిధులను మూలధన వ్యయం, రుణ చెల్లింపులు, పరిశోధన- అభివృద్ధి సహా కంపెనీ విస్తరణ, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నారు.