చమురు దిగ్గజం అరామ్‌కో లాభం రూ.10 లక్షల కోట్లు

సౌదీ చమురు దిగ్గజ కంపెనీ అరామ్‌కో ఆదివారం తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది.

Update: 2024-03-10 08:43 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: సౌదీ చమురు దిగ్గజ కంపెనీ అరామ్‌కో ఆదివారం తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. 2023 ఏడాదిలో కంపెనీ రూ.10 లక్షల కోట్ల(121 బిలియన్ డాలర్ల) లాభాన్ని ఆర్జించినట్లు తెలిపింది. ఇది గత ఏడాది 2022లో రికార్డు స్థాయిలో రూ.13 లక్షల కోట్లకు పైగా (161 బిలియన్ డాలర్ల) లాభాన్ని నివేదించింది. గతంతో పోలిస్తే సమీక్ష కాలంలో లాభం భారీగా క్షీణించింది. ప్రధానంగా ముడి చమురు ధరలు తక్కువగా ఉండటం, తక్కువ పరిమాణంలో విక్రయాలు జరగడం వలన ఇంధన శుద్ధి, రసాయనాల మార్జిన్లు బలహీనపడటంతో ఆదాయం తగ్గినట్లు కంపెనీ తడావుల్ స్టాక్ మార్కెట్‌కు దాఖలు చేసిన నివేదికలో పేర్కొంది.

కంపెనీ సీఈఓ అమిన్ H. నాసర్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, ప్రతికూల పవనాలు ఉన్నప్పటికీ కూడా మా స్థితిస్థాపకత, వేగవంతమైన చర్యలు సానుకూల నగదు ప్రవాహాలకు, అధిక స్థాయి లాభదాయకతకు దోహదపడ్డాయని అన్నారు. అరమ్‌కో మార్కెట్ విలువ $2 ట్రిలియన్‌లను కలిగి ఉంది, ఇది ఆపిల్, మైక్రోసాఫ్ట్, NVIDIA తర్వాత ప్రపంచంలోని నాలుగో అత్యంత విలువైన సంస్థగా నిలిచింది.


Similar News