జనవరిలో 11 కోట్లకు పెరిగిన డీమ్యాట్ ఖాతాలు!
దేశీయ స్టాక్ మార్కెట్లలో డీమ్యాట్ ఖాతాల సంఖ్య ఆరు నెలల గరిష్ఠానికి చేరాయి.
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లలో డీమ్యాట్ ఖాతాల సంఖ్య ఆరు నెలల గరిష్ఠానికి చేరాయి. ఈక్విటీ మార్కెట్లలో ఆకర్షణీయమైన రాబడి, కొత్త డీమ్యాట్ ఖాతా తెరిచేందుకు సులభ ప్రక్రియ, పెరిగిన పొదుపు వంటి కారణాలతో ఈ ఏడాది జనవరిలో మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య 11 కోట్లకు చేరుకుంది. ఇది ఏడాది ప్రాతిపదికన 31 శాతం వృద్ధి అని మోతీలాల్ ఓస్వాల్ నివేదిక తెలిపింది.
గత నాలుగు నెలల కంటే జనవరిలో అత్యధిక డీమ్యాట్ ఖాతాలు జోడించబడ్డాయి. అయినప్పటికీ 2021-22లో నమోదైన సగటు పెరుగుదల 29 లక్షల కంటే ఇది తక్కువగానే ఉంది. మోతీలాల్ ఓస్వాల్ ప్రకారం, గతేడాది సెప్టెంబర్‌లో 20 లక్షలు, అక్టోబర్, నవంబర్‌లలో 18 లక్షల చొప్పున, డిసెంబర్‌లో 21 లక్షల కొత్త డీమ్యాట్ ఖాతాలు పెరిగాయి. గణాంకాల ప్రకారం 2022, జనవరి నాటికి మొత్తం 8.4 కోట్ల డీమ్యాట్ అకౌంట్లు ఉన్నాయి.
ఆర్థిక విషయాల గురించి పెరిగిన అవగాహన, యువతలో ట్రేడింగ్ పట్ల పెరుగుతున్న ఆసక్తి కూడా డీమ్యాట్ ఖాతాలు పెరిగేందుకు కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతానికి జెరోధా, ఏంజెల్ వన్, గ్రో, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ మొదటి ఐదు స్టాక్ మార్కెట్ బ్రోకర్ సంస్థలుగా ఉన్నాయి.