ఎన్నికల తర్వాత డీప్‌ఫేక్‌లు, ఫేక్ న్యూస్‌పై నిబంధనల రూపకల్పన: అశ్విని వైష్ణవ్

ఎన్నికల తర్వాత డీప్‌ఫేక్‌లు, ఫేక్ న్యూస్‌లను నివారించేందుకు తగిన చర్చల అనంతరం చట్టపరమైన విధానాలను ఖరారు చేస్తామని..

Update: 2024-03-08 12:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: సమాజం, ప్రజాస్వామ్యాన్ని హాని కలిగించే ఫేక్ న్యూస్‌ను నిరోధించేందుకు, వాటిని తొలగించేందుకు త్వరలో నిబంధనలు రూపొందించనున్నట్టు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీనికోసం సాంకేతిక, వ్యాపార ప్రక్రియ పరిష్కారాలను అందించాలని ప్రభుత్వం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను కోరిందని మంత్రి పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత డీప్‌ఫేక్‌లు, ఫేక్ న్యూస్‌లను నివారించేందుకు తగిన చర్చల అనంతరం చట్టపరమైన విధానాలను ఖరారు చేస్తామని ఆయన వెల్లడించారు. ఇప్పటికే దేశంలో ఎన్నికల సీజన్ ముందుకొస్తుండటంతో సోషల్ మీడియా, ఇతర ప్లాట్‌ఫామ్‌లలో వస్తున్న డీప్‌ఫేక్, తప్పుడు సమాచారంపై డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను ప్రభుత్వం హెచ్చరించింది. 'భారత్ లాంటి శక్తివంతమైన, భిన్నమైన ప్రజాస్వామ్యంలో ఫేక్ న్యూస్ చాలా హాని కలిగిస్తుంది. ఇది సమాజానికి, ప్రజాస్వామ్యానికి, ఎన్నికల ప్రక్రియకు హానికరం. ఇలాంటివి మన భవిష్యత్తు, సమాజంలోని సామరస్యాన్ని ప్రభావితం చేస్తుందని' మంత్రి వివరించారు. ప్రస్తుతం ప్లాట్‌ఫామ్‌లు ఎలాంటి విధానంలోనైనా కొనసాగవచ్చు, ఎన్నికలు మిగిసిన వెంటనే మేము చట్టపరమైన విధానంతో కొనసాగుతామన్నారు. కొత్త విధానం ప్రతిపాదిత డిజిటల్ ఇండియా చట్టానికి కొనసాగింపు అనే దానిపై మంత్రి స్పష్టత ఇవ్వలేదు. అందులో భాగంగా లేదంటే ప్రత్యేక చట్టంగా రూపొందించవచ్చని చెప్పారు.

Tags:    

Similar News