Stock Market: ఒడిదుడుకుల మధ్య కొత్త గరిష్ఠాలకు నిఫ్టీ
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడంతో కాసేపు బలహీనపడ్డ సూచీలు ఆ తర్వాత పుంజుకున్నాయి.
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య లాభాలను దక్కించుకున్నాయి. అంతకుముందు సెషన్‌లో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న సూచీలు బుధవారం సైతం అదే ధోరణిలో ర్యాలీ చేశాయి. ఉదయం అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడంతో కాసేపు బలహీనపడ్డ సూచీలు ఆ తర్వాత పుంజుకున్నాయి. ముఖ్యంగా ఐటీ, ఫార్మా వంటి కీలక రంగాల షేర్లలో కొనుగోళ్లు జరగడంతో నిఫ్టీ సరికొత్త రికార్డు గరిష్ఠాలకు చేరింది. ఈ క్రమంలోనే స్టాక్ మార్కెట్లు వరుసగా ఏడో రోజు లాభాల్లో ముగిశాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 73.80 పాయింట్లు లాభపడి 81,785 వద్ద, నిఫ్టీ 34.60 పాయింట్లు పెరిగి 25,052 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, ఫార్మా రంగాలు 1 శాతానికి పైగా దూసుకెళ్లాయి. మిగిలిన కీలక రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, సన్‌ఫార్మా, ఎంఅండ్ఎం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాలను సాధించాయి. ఏషియన్ పెయింట్, మారుతీ సుజుకి, నెస్లె ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, కోటక్ బ్యాంక్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.93 వద్ద ఉంది.