ఏప్రిల్ 1 నుంచి ఈ-బీమా తప్పనిసరి
జీవిత, ఆరోగ్య, సాధారణ బీమా సహా అన్ని బీమా పాలసీలకు ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది.
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్‌డీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. బీమా పాలసీలను డిజిటలైజ్ చేయాలనే ఉద్దేశ్యంతో బీమా సంస్థలన్నీ తమ పాలసీదారులకు ఈ-ఇన్సూరెన్స్ పద్దతిలో పాలసీలు ఇవ్వాలని ఐఆర్‌డీఏఐ నిర్ణయించింది. జీవిత, ఆరోగ్య, సాధారణ బీమా సహా అన్ని బీమా పాలసీలకు ఈ నిబంధన వర్తిస్తుందని, కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ-ఇన్సూరెన్స్ అకౌంట్(ఈఐఏ)లను ఆన్‌లైన్ అకౌంట్‌లో బీమా పాలసీలను ఎలక్ట్రానిక్ రూపంలో సేవ్ చేస్తారు. దీని ద్వారా పాలసీదారులు బీమా ప్లాన్‌లను ఆన్‌లైన్‌లోనే చూడవచ్చు. దీనివల్ల వీటి నిర్వహణ మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. దేశంలో చాలామంది బీమా పాలసీ తీసుకోవడం పెరిగిన నేపథ్యంలో ఈ-ఇన్సూరెన్స్ వినియోగం మరింత సులభతరం చేయాలని ఆర్ఆర్‌డీఏఐ భావిస్తోంది. అన్ని రకాల బీమా పాలసీలను ఎలక్ట్రానిక్ రూపంలోకి తీసుకొస్తే ఈ-ఇన్సూరెన్స్ పూర్తిగా పేపర్‌లెస్, ఆన్‌లైన్‌లో యాక్సెస్ చేయవచ్చు. పాలసీ వివరాలతో పాటు రెన్యూవల్ తేదీలను ట్రాక్ చేయడం సులభమవుతుంది. పాలసీలో అడ్రస్ మార్పు, వివరాల అప్‌డేట్ చేయడం కూడా సులువుగా మారుతుంది.