2025లో భారత జీడీపీ వృద్ధి 6.5%: మూడీస్

భారత జీడీపీ వృద్ధి 2025లో 6.5 శాతంగా ఉంటుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనా వేసింది.

Update: 2024-07-09 11:28 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: భారత జీడీపీ వృద్ధి 2025లో 6.5 శాతంగా ఉంటుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనా వేసింది. అలాగే, 2024 సంవత్సరానికి భారత ఆర్థిక వృద్ధి అంచనాను 6.8 శాతం వద్ద మార్చకుండా అలాగే ఉంచింది. భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన నివేదికను మంగళవారం మూడీస్ విడుదల చేసింది. ఈ నివేదికలో, భారత జీడీపీ వృద్ధికి సానుకూల అంశాలు ఉన్నాయని పేర్కొంది. దేశీయంగానే కాకుండా విదేశీ పరంగా కూడా డిమాండ్ పెరగడం వల్ల అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారత జీడీపీ బలమైన వృద్ధి సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంచనా వేసింది.

బలమైన తయారీ కార్యకలాపాలు, అవస్థాపన ఖర్చుల నేపథ్యంలో అంతకుముందు మూడీస్ తన నివేదికలో భారత దేశ జీడీపీ వృద్ధిని 6.1 శాతం నుంచి 6.8 శాతానికి పెంచింది. జీ 20 ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని గతంలో తెలపగా, ఇప్పుడు 2024లో కూడా వృద్ధిని 6.8 శాతంగా కొనసాగించింది. ప్రధానంగా భారతదేశంలో ఆహార ధరలు తక్కువగా ఉండటం వల్ల ప్రధాన ద్రవ్యోల్బణం మందగించిందని, అయితే ధరల అస్థిరత సమస్యగానే ఉందని మూడీస్ పేర్కొంది. దేశంలో ద్రవ్యోల్బణం 2023లో 5.7 శాతం నుంచి 2024లో 5.2 శాతానికి, 2025లో 4.8 శాతానికి తగ్గుతుందని మూడీస్ అంచనా వేసింది. వడ్డీరేట్ల తగ్గింపుపై ఇప్పట్లో ఆర్‌బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదని రేటింగ్ ఏజెన్సీ తన నివేదికలో పేర్కొంది.


Similar News