PM: ఫిన్‌టెక్ రంగం కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది: మోడీ
ఫిన్‌టెక్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటోందని ప్రధాని మోడీ అన్నారు
దిశ, బిజినెస్ బ్యూరో: ఫిన్‌టెక్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటోందని ప్రధాని మోడీ అన్నారు. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2024లో మాట్లాడిన ఆయన, గత 10 ఏళ్లలో ఫిన్‌టెక్ రంగం 31 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించింది, ఏంజెల్ ట్యాక్స్ రద్దు కూడా వృద్ధికి ఒక అడుగు అని అన్నారు. ఆర్థిక సేవలను అందరికి చేర్చడంలో భారతీయుల జీవన నాణ్యతను మెరుగుపరచడంలో ఫిన్‌టెక్ గణనీయమైన పాత్ర పోషించింది. దీనిని భారతీయులు వేగంగా స్వీకరించారు. దేశంలో ఫిన్‌టెక్ రంగం తీసుకువచ్చిన మార్పు కేవలం సాంకేతిక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా, సామాజికంగా చాలా విస్తృతమైన ప్రభావం చూపించదని అన్నారు.
సైబర్ మోసాలను అరికట్టడానికి, ప్రజలలో డిజిటల్ అక్షరాస్యతను మరింత పెంచడానికి మరిన్ని చర్యలు తీసుకోవాలని నియంత్రణాధికారులను మోడీ కోరారు. ఈ రంగం గ్రామాలు, నగరాల మధ్య అంతరాన్ని తగ్గించింది. గత కొన్నేళ్లుగా ఫిన్‌టెక్ స్టార్టప్‌లు 500 శాతం వృద్ధి చెందాయని చెప్పారు. భారతదేశంలో ఇది పండుగల సీజన్, ఆర్థిక వ్యవస్థ, మార్కెట్లలో కూడా పండగ మొదలైంది, బలమైన జీడీపీ వృద్ధి, క్యాపిటల్ మార్కెట్ కొత్త గరిష్టాలను చేరడానికి సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా మైక్రోఫైనాన్స్ పథకం అయిన ప్రధాన మంత్రి ముద్ర యోజన కింద రూ. 27 లక్షల కోట్లకు పైగా రుణాలు పంపిణీ చేసినట్లు మోడీ సభలో చెప్పారు.
ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఆర్థిక లావాదేవీలను విస్తరించడంలో, సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో, రియల్ టైమ్ సేవలను ప్రారంభించడంలో డిజిటల్ టెక్నాలజీలు కీలకపాత్ర పోషిస్తున్నాయని అన్నారు. నేడు, భారతదేశం డిజిటల్ చెల్లింపులలో గ్లోబల్ లీడర్‌గా ఉంది, ఇది ఆవిష్కరణ, సాంకేతిక పురోగతులతో చురుకైన పాలసీ మేకింగ్ ద్వారా సాధించిన ఘనత అని అన్నారు.