Apple: సీసీఐ దర్యాప్తును హోల్డ్ చేయాలన్న యాపిల్ అభ్యర్థనను తిరస్కరించిన సీసీఐ
దర్యాప్తును తాత్కాలికంగా నిలిపేయాలని యాపిల్ చేసిన అభ్యర్థనను సీసీఐ తిరస్కరించింది.
దిశ, బిజినెస్ బ్యూరో: అనైతిక వ్యాపార పద్ధతుల ఆరోపణలు ఎదుర్కొంటున్న యాపిల్‌పై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి దర్యాప్తును తాత్కాలికంగా నిలిపేయాలని యాపిల్ చేసిన అభ్యర్థనను సీసీఐ తిరస్కరించింది. 2021 నాటి కేసులో యాపిల్ తన మార్కెట్ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసిందని దర్యాప్తు నివేదిక నిర్ధారించింది. ఐఓఎస్ యాప్‌లు, డిజిటల్ కంటెంట్‌కు చెల్లింపులకు సంబంధించి పోటీ చట్టాలకు విరుద్ధంగా యాపిల్ అనైతిక పద్ధతులను పాటించిందని, ఆధిపత్య ధోరణి ప్రదర్శించినట్టు ఆరోపణలు వచ్చాయి. సీసీఐ విచారణలో ప్రధాన ఫిర్యాదుదారూపై సరైన ఆదేశాలను పాటించలేదని నవంబర్‌లో యాపిల్ ఆరోపించింది. అందుకుగానూ ఇండియన్ నాన్-ప్రాఫిట్ టుగెదర్ వి ఫైట్ సొసైటీ(టీడబ్ల్యూఎఫ్ఎస్)పై చర్యలు తీసుకోవాలని, సవరించిన నివేదికను నిలిపేయాలని కోరింది. దర్యాప్తు నివేదికను నిలిపేయాలన్న యాపిల్ అభ్యర్థన ఆమోదయోగ్యం కాదని సీసీఐ తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.