దేశీయ వ్యాపారుల కోసం వాట్సాప్ సరికొత్త ఫీచర్లు!
సోషల్ మీడియా సంస్థ మెటా ప్లాట్‌ఫామ్స్ తన మేసేజింగ్ యాప్ వాట్సాప్‌లో దేశీయ వ్యాపారుల కోసం సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ముంబై: సోషల్ మీడియా సంస్థ మెటా ప్లాట్‌ఫామ్స్ తన మేసేజింగ్ యాప్ వాట్సాప్‌లో దేశీయ వ్యాపారుల కోసం సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముంబైలో జరిగిన మెటా రెండో వార్షిక సమావేశంలో దీన్ని ఆవిష్కరించింది. దేశంలోని వ్యాపారులు, ప్రజలు చాలా విరివిగా వాట్సాప్‌ను వాడుతున్నారని, దీనికి సంబంధించి భారత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని వర్చువల్‌గా సమావేశానికి హాజరైన సంస్థ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ అన్నారు.
వ్యాపారులకు మెటా వెరిఫైడ్ బ్యాడ్జ్‌తో పాటు వాట్సాప్ చాట్‌లోనే చెల్లింపులు చేసే ఫీచర్‌ను అందించనున్నట్టు మార్క్ అన్నారు. అంతేకాకుండా చాట్ థ్రెడ్స్‌లోనే వినియోగదారులకు అవసరమైన సేవలందించేందుకు వీలుగా 'ఫ్లోస్' అనే సదుపాయాన్ని అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సదుపాయంతో ఏదైనా బ్యాంకు తన ఖాతాదారులకు అపాయింట్‌మెంట్ బుకింగ్, అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం కూడా ఉంటుందని మార్క్ వివరించారు.
ఫుడ్ డెలివరీలు అందించే రెస్టారెంట్ నుంచి ఆర్డర్లు పెట్టుకోవచ్చని, విమాన టికెట్లు, సీట్ల ఎంపిక వంటి అనేక ఫీచర్లు అందించనున్నట్టు స్పష్టం చేశారు. వ్యాపారులకు అందించే మెటా వెరిఫైడ్ బ్యాడ్జ్‌ను మరికొన్ని నెలల్లో ఇవ్వనున్నట్టు మార్క్ వెల్లడించారు.