రెండోసారి 251 మంది ఉద్యోగులను తొలగించిన మీషో!
ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ మీషో మరోసారి భారీ సంఖ్యలో లేఆఫ్స్ ప్రకటించింది.
బెంగళూరు: ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ మీషో మరోసారి భారీ సంఖ్యలో లేఆఫ్స్ ప్రకటించింది. గతంలో 250 మంది ఉద్యోగులను ఇంటికి పంపిన యూనికార్న్ కంపెనీ తాజాగా మరో 251 మందిని తీసేయాలని నిర్ణయించినట్టు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. తాజా లేఆఫ్స్ కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 15 శాతానికి సమానం. దీంతో ఏడాది వ్యవధిలోనే కంపెనీ రెండోసారి ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ చేపట్టింది.
తొలగింపులకు సంబంధించి మీషో ఉద్యోగులకు మెయిల్ ద్వారా తెలియజేసినట్టు తెలుస్తోంది. ఆర్థిక అనిశ్చితి అతి పెద్ద సవాలుగా ఉన్న కారణంగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ తప్పనిసరిగా మారిందని మీషో సీఈఓ విదిత్ ఆత్రే మెయిల్‌లో పేర్కొన్నారు. 2020-2022 మధ్యకాలంలో కంపెనీ ముఖ్యంగా కొవిడ్, గణనీయమైన పెట్టుబడుల మద్దతుతో 10 రెట్ల వృద్ధిని సాధించింది. అయితే ఆ తర్వాత నెలకొన్న ప్రతికూల పరిణామాల మధ్య ఒత్తిడి పెరిగిందని, ఉద్యోగుల నియామకాలకు సంబంధించి జాగ్రత్తగా ఉండాల్సిందని విదిత్ అభిప్రాయపడ్డారు.
ఉద్యోగులను సమర్థవంతంగా వినియోగించడంలో కూడా పొరపాట్లు జరిగాయని, ప్రస్తుతం ఆ సమస్యలతో పాటు ఖర్చుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి కంపెనీ తరపున సహకారం లభిస్తుందని, ఒకేసారి రెండున్నర నుంచి 9 నెలల జీతం పరిహారంగా ఇవ్వనున్నట్లు మీషో స్పష్టం చేసింది. ఉద్యోగులందరికీ పరిహారం ఉంటుందని, బీమా ప్రయోజనాలు కూడా కొనసాగుతాయని, కొత్త ఉద్యోగాలను వెతుక్కోవడం కోసం సహాయం అందించనున్నట్టు కంపెనీ పేర్కొంది.