'ఇగ్నిస్' కారు ధరను రూ. 27 వేలు పెంచిన మారుతి సుజుకి!

దేశీయ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన హ్యాచ్‌బ్యాక్ మోడల్ ఇగ్నిస్ ధరను పెంచుతున్నట్టు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది

Update: 2023-02-24 09:52 GMT

ముంబై: దేశీయ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన హ్యాచ్‌బ్యాక్ మోడల్ ఇగ్నిస్ ధరను పెంచుతున్నట్టు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ కారు వేరియంట్‌ని బట్టి ధర పెరుగుదల ఉంటుందని, గరిష్ఠంగా రూ. 27,000(ఎక్స్‌షోరూమ్ ధరపై) ఉంటుందని కంపెనీ బీఎస్ఈ ఫైలింగ్‌లో తెలిపింది. సవరించిన ధరలు శుక్రవారం(ఫిబ్రవరి 24) నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొంది.

మారుతీ సుజుకి ఇగ్నిస్ కారు ఇప్పుడు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్(ఈఎస్‌పీ), హిల్ హోల్డ్ అసిస్ట్‌ని స్టాండర్డ్ ఫీచర్‌గా వస్తుందని, అన్ని వేరియంట్లలో తమ వినియోగదారులకు అదనపు భద్రతను అందిస్తుందని కంపెనీ వివరించింది. అదేవిధంగా ఈ మోడల్ కారు రాబోయే ఈ20, రియల్ డ్రైవింగ్ ఉద్గారాల నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. ఇగ్నిస్ మోడల్ కారు మొత్తం తొమ్మిది రంగుల్లో లభిస్తుందని, దీని ప్రారంభ ధర రూ. 5.55 లక్షల నుంచి ఉంటుందని కంపెనీ తెలిపింది.

ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుండగా, ఇందులో డీజిల్ వేరియంట్‌ను నిలిపేసినట్టు కంపెనీ స్పష్టం చేసింది. ఈ కారులో 7 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్ సహా పలు సేఫ్టీ ఫీచర్లు అందించామని మారుతి సుజుకి వెల్లడించింది.

Tags:    

Similar News