New Year ని ఘనంగా ప్రారంభించిన Stock Markets !
భారత స్టాక్ మార్కెట్లు 2023 ఏడాదిని ఘనంగా ప్రారంభించాయి
ముంబై: భారత స్టాక్ మార్కెట్లు 2023 ఏడాదిని ఘనంగా ప్రారంభించాయి. కొత్త సంవత్సరం మొదటిరోజున ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన కొంతసేపు తడబడ్డప్పటికీ మిడ్-సెషన్‌కు ముందు నుంచి సూచీలు పుంజుకున్నాయి. ముఖ్యంగా మెటల్, ఆటో, ఇన్‌ఫ్రా రంగ షేర్లలో భారీ కొనుగోళ్లతో మార్కెట్లకు కీలక మద్దతిచ్చాయి.
గత నెలలో జీఎస్టీ వసూళ్లు ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణను సూచిస్తుండటం, సోమవారం విడదలైన తయారీ పీఎంఐ సూచీ 13 నెలల గరిష్ఠానికి చేరడం, 2022 ఏడాదికి వాహనాల అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదవడం వంటి పరిణామాలు మార్కెట్ల ర్యాలీకి కారణమయ్యాయని విశ్లేషకులు తెలిపారు. వీటికి తోడు గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో మదుపర్ల సెంటిమెంట్ బలపడింది.
దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 327.05 పాయింట్లు లాభపడి 61,167 వద్ద, నిఫ్టీ 92.15 పాయింట్లు పెరిగి 18,197 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఫార్మా రంగం మాత్రమే నీరసించింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా స్టీల్ అత్యధికంగా 6 శాతం మేర లాభపడింది. టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎంఅండ్ఎం, రిలయన్స్, ఇన్ఫోసిస్, ఎన్‌టీపీసీ కంపెనీల షేర్లు రాణించాయి.
ఏషియన్ పెయింట్, టైటాన్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, సన్‌ఫార్మా, ఎస్‌బీఐ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 82.79 వద్ద ఉంది.
ఇవి కూడా చదవండి : కొత్త ఏడాదిలో మంచి రాబడి కోసం ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టండి!