డ్యూయెల్-ఫ్యూయెల్ కమర్షియల్ వాహనం విడుదల చేసిన మహీంద్రా!
దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా కొత్తగా రెండు రకాల ఇంధన వినియోగంతో నడిచే వాహనాన్ని మార్కెట్లో విడుదల చేసింది.
న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా కొత్తగా రెండు రకాల ఇంధన వినియోగంతో నడిచే వాహనాన్ని మార్కెట్లో విడుదల చేసింది. సుప్రో సీఎన్‌జీ డ్యుయో పేరుతో తెచ్చిన ఈ వాహనంతో కంపెనీ స్మాల్ కమర్షియల్ వాహనాల్లో డ్యుయెల్-ఫ్యూయెల్ విభాగంలోకి అడుగుపెట్టినట్టు అయింది. ఈ మోడల్ సీఎన్‌జీతో పాటు పెట్రోల్‌తోనూ పనిచేస్తుంది.
రూ. 6.32 లక్షల ధరతో విడుదల చేసిన ఈ వాహనం 750 కిలోల వరకు బరువును మోస్తుందని కంపెనీ గురువారం ప్రకటనలో వెల్లడించింది. 27 బీహెచ్‌పీ పవర్‌తో వచ్చే ఈ మోడల్ ఒక కేజీ సీఎన్‌జీకి 23.35 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. 75 లీటర్ల సీఎన్‌జీ ట్యాంక్ సామర్థ్యంతో 325 కి.మీ. వరకు ఇబ్బందుల్లేకుండా ప్రయాణించవచ్చని, ఐదు లీటర్ల పెట్రోల్ ట్యాంక్ కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇంటర్‌సిటీ ప్రయాణాలకు ఈ వాహనం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని కంపెనీ అభిప్రాయపడింది.
గడిచిన నాలుగేళ్లలో సీఎన్‌జీ వాహనాలు నాలుగు రెట్లు పెరిగాయని మహీంద్రా అండ్ మహీంద్రా వైస్-ప్రెసిడెంట్ బనేశ్వర్ బెనర్జీ అన్నారు. 2 టన్నుల కమర్షియల్ వాహనాల విభాగంలో నెలకు 16 వేల యూనిట్లను విక్రయిస్తున్నామని, అందులో 5 వేల వరకు సీఎన్‌జీ వాహనాలు ఉన్నాయని బెనర్జీ చెప్పారు.