Gold Rate: త్వరలో 'వన్ నేషన్ వన్ గోల్డ్ రేట్' అమలు: జ్యువెలర్స్ కౌన్సిల్

దేశవ్యాప్తంగా ఒకే ధర ఉండాలని భావిస్తున్నామని జీజేసీ సెక్రటరీ మితేష్ దోర్డా చెప్పారు.

Update: 2024-10-22 15:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో బంగారం ధరలు ఒకేలా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్(జీజేసీ) తెలిపింది. దేశీయ బంగారం ధరలను ప్రామాణీకరించే లక్ష్యంలో భాగంగా 'వన్ నేషన్ వన్ గోల్డ్ రేట్' అమలు కోసం కృషి చేస్తున్నామని వెల్లడించింది. దేశవ్యాప్తంగా వ్యాపారులు ఒకే రేటుతో బంగారాన్ని దిగుమతి చేసుకుంటాం. కానీ, రిటైల్ ధరలు మాత్రం నగరానికి నగరానికి మధ్య భిన్నంగా ఉంటాయి. దీన్ని మారుస్తూ దేశవ్యాప్తంగా ఒకే ధర ఉండాలని భావిస్తున్నామని జీజేసీ సెక్రటరీ మితేష్ దోర్డా చెప్పారు. మంగళవారం ప్రారంభమైన పసిడి వేడుక 'లక్కీ లక్ష్మీ' సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లక్కీ లక్ష్మీ కార్యక్రమం అక్టోబర్ 22 నుంచి డిసెంబర్ 9 వరకు జరుగుతుంది. కౌన్సిల్ ఇప్పటికే సభ్యులుగా ఉన్నవారితో 50కి పైగా సమావేశాలను నిర్వహించింది. 8 వేల మంది వరకు స్వర్ణకారులను బోర్డులో చేర్చుకున్నాం. దేశమంతా ఒకే ధరలో బంగారం ఉండేలా సభ్యులను ఒప్పించేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్టు జీజేసీ పేర్కొంది. ఇప్పటికే వాట్సాప్ ద్వారా సిఫార్సు చేసిన రేటును అందరికీ చేరవేస్తున్నాం. దశలవారీగా కనీసం 4-5 లక్షల స్వర్ణకారులను చేరుకోవాలని భావిస్తున్నామని మితేష్ చెప్పారు. మరో ఆరునెలల్లో ఈ ప్రక్రియను క్రమబద్దీకరిస్తామన్నారు.  

Tags:    

Similar News