హోటల్ వ్యాపారాన్ని వేరుచేసిన ఐటీసీ!

ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ సంస్థ తన హోటల్ వ్యాపారాన్ని విడదీసేందుకు డైరెక్టర్ల బోర్డు సూత్రప్రాయంగా ఆమోదం పొందినట్టు సోమవారం ప్రకటించింది.

Update: 2023-07-24 15:20 GMT

ముంబై: ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ సంస్థ తన హోటల్ వ్యాపారాన్ని విడదీసేందుకు డైరెక్టర్ల బోర్డు సూత్రప్రాయంగా ఆమోదం పొందినట్టు సోమవారం ప్రకటించింది. హోటళ్లు, హాస్పిటాలిటీ వ్యాపారం కోసం కొత్తగా ఏర్పాటైన సంస్థకు ఐటీసీ హోటల్స్‌గా పేరు నిర్ణయించగా, ఇది ఐటీసీ లిమిటెడ్ పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థగా ఉంటుంది. ఐటీసీ హోటల్స్‌లో 40 శాతం వాటాను ఐటీసీ కలిగి ఉంటుంది. మిగిలిన 60 శాతం వాటా కంపెనీ వాటాదారుల వద్ద ఉంటుంది. ఈ ఏడాది ఆగష్టు 14న సమావేశమయ్యే బోర్డు తదుపరి సమావేశంలో ఈ నిర్ణయంపై తుది నిర్ణయం జరుగుతుంది.

సెబీ లిస్టింగ్ నిబంధనలు, సంబంధిత చట్టాలకు అనుగుణంగా తదుపరి ప్రకటన ఉంటుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఐటీసీ హోటల్స్‌కు దేశవ్యాప్తంగా 70కి పైగా ప్రాంతాల్లో 120 హోటళ్లు ఉన్నాయి. కొత్త డీమెర్జర్ నిర్ణయం ద్వారా కంపెనీ పెట్టుబడిదారులను, భాగస్వామ్యాలను ఆకర్షితుందని, ఆతిథ్య రంగంలో కంపెనీ వృద్ధి మెరుగ్గా ఉంటుందని కంపెనీ అభిప్రాయపడింది. సోమవారం కంపెనీ ఐటీసీ హోటల్స్ డీమెర్జర్ ప్రకటనతో ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనబడింది. మార్కెట్లు ముగిసే సమయానికి షేర్ ధర 2 శాతానికి పైగా నష్టపోయి రూ. 479 వద్ద ఉంది.


Similar News