ఈ ఏడాది జీతాల పెంపుపై ఐటీ కంపెనీలు వెనక్కి తగ్గే అవకాశం!

దేశీయ ఐటీ పరిశ్రమలోని కంపెనీలు వ్యయ నియంత్రణపై దృష్టి సారిస్తున్నాయి

Update: 2023-02-07 11:27 GMT

న్యూఢిల్లీ: దేశీయ ఐటీ పరిశ్రమలోని కంపెనీలు వ్యయ నియంత్రణపై దృష్టి సారిస్తున్నాయి. ఆర్థిక మాంద్యం భయాలు, అధిక ద్రవ్యోల్బణ పరిస్థితుల మధ్య గత కొంతకాలంగా ఐటీ రంగంలో భారీగా ఉద్యోగుల తొలగింపులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు కంపెనీలు పరిశ్రమలో తగ్గిన మార్జిన్‌లను మెరుగుపరిచేందుకు, ఖర్చులను అదుపులో పెట్టేందుకు తగిన నిర్ణయాలను అమలు చేసే పనిలో ఉన్నాయి.

ముఖ్యంగా గత ఏడాది నుంచి అధిక వేతనాలతో నియమించిన ఐటీ ఉద్యోగుల విషయంలో వారి పనితీరును అంచనా వేస్తున్నాయి. కంపెనీలు ఖర్చులను నియంత్రించడానికి ఉద్యోగులను ఉపయోగించుకోవాలని భావిస్తున్నాయి. దీనికోసం ఈ ఏడాదిలో ఉద్యోగుల జీతాల పెంపులను నిలిపేయాలనే యోచనలో ఉన్నాయి. ఇందులో కొత్త ఉద్యోగులతో పాటు గత రెండేళ్లలో అధిక జీతాలతో నియమించబడిన సీనియర్ ఉద్యోగులకు కూడా వర్తించేలా చర్యలు తీసుకోనున్నారు.

గతేడాది దిగ్గజ ఐటీ సంస్థలు మిడ్-మేనేజ్‌మెంట్ విభాగాల్లో 5-12 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ టెక్నికల్ ఉద్యోగులను నియమించాయి. కంపెనీల మొత్తం ఉద్యోగుల్లో వీరి వాటా 70 శాతం ఉంది. కరోనా పరిణామాలు లేకపోవడంతో ఐటీ పరిశ్రమలో కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఇప్పుడిప్పుడే వృద్ధిపై పరిశ్రమ ఆశాజనకంగా ఉన్నప్పటికీ మార్జిన్‌లు తగ్గడం, ఉద్యోగులను తొలగించాల్సి రావడం వంటి అంశాలు కొంత ఒత్తిడిని కలిగిస్తున్నాయి.

దీంతో ఖర్చు నియంత్రణను ఉద్యోగుల పనితీరు ఆధారంగా చేపట్టాలని ప్రయత్నిస్తున్నాయి. ఇటీవలే ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లో విఫలమైన 600 మందిని తొలగించిన సంగతి తెలిసిందే.

Read More: బంగారం ధర సామాన్యులకు భారంగా మారనుందా.. ధర ఎంత పెరిగిందంటే ?

Tags:    

Similar News