IRCTC: రైల్వే టికెట్ బుకింగ్ మరింత ఈజీ.. IRCTC సిస్టమ్ అప్‌గ్రేడ్
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి సిద్ధం అయింది
దిశ, బిజినెస్ బ్యూరో: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి సిద్ధం అయింది. ఈ క్రమంలో మార్చి 2025 నాటికి టికెటింగ్ సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేసే పనిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియను మొదలు పెట్టింది. ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్ బుకింగ్‌లు భారీగా పెరగడంతో దాని ట్రాఫిక్ పెరిగి సైట్‌పై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ప్రయాణికులు బుకింగ్ కన్ఫర్మేషన్ కోసం కూడా ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో ఐఆర్‌సీటీసీ పనితీరును మరింత వేగవంతం చేయడానికి దాని సాఫ్ట్‌వేర్‌లో మార్పులు తెస్తున్నారు.
ఈ కొత్త అప్‌గ్రేడ్ పూర్తయిన తరువాత ప్రయాణికులు ఎలాంటి వేయిటింగ్ లేకుండా వేగవంతంగా టికెట్ బుకింగ్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే కొన్ని సార్లు బుకింగ్ సమయంలో డబ్బులు అకౌంట్ నుంచి కట్ అయిన తరువాత కూడా టికెట్ కన్ఫర్మేషన్ కానీ సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలాంటి ఇష్యూలు సాంకేతిక కారణాల వలన వస్తుంటాయి. ఈ సమస్యలను కూడా కొత్త అప్‌గ్రేడ్ ద్వారా పరిష్కరించాలని చూస్తున్నారు.
ఐఆర్‌సీటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (CMD) సంజయ్ జైన్ మాట్లాడుతూ, ప్రస్తుత వ్యవస్థ పరిమిత సామర్థ్యం కారణంగా ఈ సమస్యలు తలెత్తుతున్నాయని, ఆన్‌లైన్‌లో అధిక సంఖ్యలో ప్రయాణికులు టికెట్‌లను బుక్ చేసుకోవడంతో సిస్టమ్ సామర్థ్యాన్ని మించడంతో ఇలాంటి పరిస్థితులకు దారి తీస్తుందని అన్నారు.
ఐఆర్‌సీటీసీకి సుమారు మూడు కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ప్రయాణికులు, ఏజెంట్ బుకింగ్‌లను కవర్ చేస్తూ ప్రతిరోజూ తొమ్మిది లక్షలకు పైగా టికెట్‌లు ఆన్‌లైన్‌లో బుక్ అవుతున్నాయి. అంతకుముందు 2023లో, రైల్వేలు నిమిషానికి 25,000 నుండి 2.25 లక్షలకు టిక్కెట్లు జారీ చేసే సామర్థ్యాన్ని అప్‌గ్రేడ్ చేయాలని, విచారణలను నిమిషానికి 40,000 నుండి 4 లక్షలకు అప్‌గ్రేడ్ చేయాలని ప్లాన్ చేసింది.