2024 కేంద్ర బడ్జెట్ ఎలా ఉండబోతోంది..
ఎన్నికల ఏడాది కావడంతో ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఆర్థిక లోటు, పన్నులు, సంక్షేమ పథకాల వ్యయంపై దృష్టి
దిశ, బిజినెస్ బ్యూరో: 2024 ఎన్నికల సంవత్సరం కావడంతో కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. కాబట్టి కేంద్ర బడ్జెట్-2024కి ముందు ఆర్థిక లోటు, పన్నులు, సంక్షేమ పథకాల వ్యయంపై పభుత్వం దృష్టి సారించనున్న నేపథ్యంలో ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు పలు రకాల అంచనాలతో ఉన్నారు. వివిధ గ్లోబల్ ఫైనాన్షియల్ సంస్థలు ప్రభుత్వం ఆర్థిక స్థిరత్వానికి తగినట్టుగా నిర్ణయాలు తీసుకోవచ్చని భావిస్తున్నారు. దీంతో ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్ కోసం అందరూ ఆసక్తిగా ఉన్నారు.
ఎన్నికల ఏడాది కావడంతో ప్రభుత్వం పూర్తి బడ్జెట్‌కు బదులుగా మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించనుంది. ప్రభుత్వం కొనసాగే వీలు లేనప్పుడు, ఎన్నికలు దగ్గర పడినప్పుడు స్వల్పకాలానికి రూపొందించే బడ్జెట్‌ను మధ్యంతర బడ్జెట్ అంటారు. ఈ బడ్జెట్ వ్యవధి 2 నుంచి 6 నెలలు. ఇందులో ఖర్చులు మాత్రమే ఉంటాయి.
ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ఈవై ఇండియా, 2024 మధ్యంతర బడ్జెట్‌లో కొత్త తయారీ యూనిట్ల కోసం రాయితీతో కూడిన 15 శాతం ఆదాయపు పన్ను రేటును పొడిగించడమే కాకుండా ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించే చర్యలు తీసుకోవచ్చని అంచనా వేస్తోంది. 2019, అక్టోబర్ 1 తర్వాత ఏర్పాటైన ఏదైనా దేశీయ కంపెనీ తయారీ రంగంలో కొత్త పెట్టుబడులు పెడితే, 2023, మార్చి 31లోపు ఉప్పత్తిని ప్రారంభిస్తే 15 శాతం చొప్పున ఆదాయపు పన్ను చెల్లింపునకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. అనంతరం దీన్ని 2024, మార్చి 31 వరకు పొడిగించారు. ఈసారి బడ్జెట్లో దీన్ని 2025, మార్చి 31కి పొడిగించవచ్చని భావిస్తున్నారు. గ్లోబల్ ఫైనాన్షియల్ సంస్థ బార్‌క్లేస్, లోటు, రుణాలను తగ్గించే లక్ష్యంతో ఆర్థిక ఏకీకరణపై దృష్టి సారించవచ్చని అభిప్రాయపడింది. అలాగే, మూలధన వ్యయానికి ప్రాధాన్యత ఇస్తుందని చెబుతూనే, అప్పులు తగ్గించుకునే నిర్ణయాలు అవసరమని బార్‌క్లేస్ సూచించింది. మరో ఆర్థిక సంస్థ డెలాయిట్ ప్రభుత్వం ఇంధన రంగంలో పెట్టుబడులను పెంచేందుకు ప్రయత్నించవచ్చని తెలిపింది. 2024 బడ్జెట్‌లో ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీపై ఎక్కువ దృష్టి పెట్టి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ప్రైవేట్ రంగ వాటాను పెంచేందుకు ప్రయత్నించవచ్చని అంచనా వేసింది.