డిసెంబర్‌లో 4.3 శాతంగా పారిశ్రామికోత్పత్తి వృద్ధి!
దేశీయ పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) వృద్ధి గతేడాది డిసెంబర్‌లో 4.3 శాతంగా నమోదైంది.
న్యూఢిల్లీ: దేశీయ పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) వృద్ధి గతేడాది డిసెంబర్‌లో 4.3 శాతంగా నమోదైంది. ఇది అంతకుముందు నెలలో నమోదైన 7.3 శాతం కంటే చాలా తక్కువ. అంతకుముందు ఏడాది 2021, డిసెంబర్ నెల కంటే పారిశ్రామికోత్పత్తి వృద్ధి మెరుగ్గా ఉంది. శుక్రవారం జాతీయ గణాంక కార్యాలయం(ఎన్ఎస్ఓ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, తయారీ రంగం బలహీనపడిన కారణంగా మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి నెమ్మదించింది.
సమీక్షించిన నెలలో తయారీ ఉత్పత్తి డిసెంబర్‌లో 2.6 శాతానికి పెరగ్గా, నవంబర్‌లో ఇది 6.6 శాతంగా ఉంది. మిగిలిన వాటిలో మైనింగ్ 2.6 శాతం నుంచి 9.8 శాతం, విద్యుదుత్పత్తి 10.4 శాతం, కేపిటల్ గూడ్స్ 7.6 శాతం వృద్ధి నమోదు చేశాయి. ఇంటర్మీడియట్ వస్తువుల ఉత్పత్తి 0.3 శాతం, కన్స్యూమర్ డ్యూరబుల్స్ 10.4 శాతం క్షీణించింది. నాన్-డ్యూరబుల్స్ వస్తువుల ఉత్పత్తి 7.2 శాతం పెరిగింది. ప్రాథమిక వస్తువులు 8.3 శాతం, ఇంటర్మీడియేట్ వస్తువుల విభాగం 2.8 శాతం వృద్ధి సాధించినట్టు గణాంకాలు పేర్కొన్నాయి.