Credit Card: క్రెడిట్ కార్డుల యూజర్లకు బ్యాడ్ న్యూస్.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..!
దేశంలో ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డుల(Credit Cards) వినియోగం భారీగా పెరిగిపోయింది.
దిశ,వెబ్‌డెస్క్: దేశంలో ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డుల(Credit Cards) వినియోగం భారీగా పెరిగిపోయింది. ఉద్యోగుల(Jobers) నుంచి వ్యాపారుల(Business Mans) వరకు ఇలా చాలా మందికి వివిధ బ్యాంకులు క్రెడిట్ కార్డులను అందిస్తున్న విషయం తెలిసిందే. క్రెడిట్ కార్డు యూజర్లు వేలకు వేల రూపాయలు వాడేసి సకాలంలో బిల్లు చెల్లించడంలో విఫలమవుతున్నారు. దీంతో బ్యాంకులు వినియోగదారుల నుంచి అధిక మొత్తంలో వడ్డీని(Interest) వసూలు చేస్తున్నాయి. కాగా క్రెడిట్ కార్డు లేట్ పేమెంట్ చెల్లింపులపై వడ్డీ రేట్లకు సంబంధించి సుప్రీంకోర్టు(Supreme Court) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. గడువు ముగిసిన కార్డు చెల్లింపులపై వడ్డీ రేట్లను 30 శాతానికి పరిమితం చేస్తూ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(NCDRC) 2008లో ఇచ్చిన తీర్పును కోర్టు కొట్టిపారేసింది. వడ్డీ రేట్లపై బ్యాంకులదే తుది నిర్ణయం అని కోర్టు సృష్టం చేసింది. దీంతో క్రెడిట్ కార్డు యూజర్లు గడువు ముగిసేలోగా బిల్లు పే చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
క్రెడిట్ కార్డు లేట్ పేమెంట్ చెల్లింపులపై బ్యాంకులు 36 నుంచి 49 శాతం వరకు వడ్డీని వసూలు చేయడంపై ఆవాజ్ ఫౌండేషన్(Awaaz Foundation) 2008లో NCDRCను ఆశ్రయించింది. క్రెడిట్ కార్డు లేట్ పేమెంట్ చెల్లింపులపై సంవత్సరానికి 30 శాతం కంటే ఎక్కువ వడ్డీ వసూల్ చేయరాదని NCDRC తీర్పు వెలువరించింది. దీనిపై బ్యాంకులు 2009లో సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. మొదట స్టే ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు కొన్ని రోజుల తర్వాత స్టే విధించింది. సుమారు 16 ఏళ్ల తర్వాత కమిషన్ ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టింది. దీంతో నిర్ణీత గడువులోగా బిల్లు చెల్లించని వినియోగదారుల నుంచి పెద్ద మొత్తంలో వడ్డీ వసూలు చేసుకొనేందుకు బ్యాంకులకు మార్గం సుగమమైంది..