మార్చిలో 24 శాతం క్షీణించిన రత్నాభరణాల ఎగుమతులు!

ఈ ఏడాది మార్చి నెలకు సంబంధించి మొత్తం రత్నాభరణాల ఎగుమతులు 23.75 శాతం క్షీణించి రూ. 21,501.96 కోట్లకు చేరాయి.

Update: 2023-04-18 16:49 GMT

ముంబై: ఈ ఏడాది మార్చి నెలకు సంబంధించి మొత్తం రత్నాభరణాల ఎగుమతులు 23.75 శాతం క్షీణించి రూ. 21,501.96 కోట్లకు చేరాయి. గతేడాది ఇదే నెలలో వీటి ఎగుమతులు రూ. 28,198.36 కోట్లుగా ఉన్నాయని రత్నాభరణాల ఎగుమతి ప్రోత్సాహక మండలి(జీజేఈపీసీ) మంగళవారం ప్రకటనలో తెలిపింది. గ్లోబల్ మార్కెట్లో సవాళ్ల కారణంగా భారత్ నుంచి రత్నాభరణాల ఎగుమతులు ఒత్తిడిని ఎదుర్కొన్నాయని జీజేఈపీసీ ఛైర్మన్ విపుల్ షా అన్నారు.

గత ఆర్థిక సంవత్సరంలో భారత రత్నాభరణాల ఎగుమతులు స్వల్పంగా 2.48 శాతం పెరిగాయి. అధిక ద్రవ్యోల్బణం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, దాదాపు ఆరు నెలలు చైనాలో లాక్‌డౌన్ వంటి ప్రపంచ సవాళ్ల కారణంగా 2022-23లో రత్నాభరణాలు రూ. 3,00,462.52 కోట్లకు చేరుకున్నాయని జీజేఈపీసీ వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వీటి ఎగుమతులు రూ. 2,93,193.19 కోట్లుగా నమోదయ్యాయి.

భారత్-యూఏఈ మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సకాలంలో అమలు కావడంతో గతేడాది సాదా బంగారు ఆభరణాల ఎగుమతులు 17 శాతం పుంజుకున్నాయని విపుల్ షా పేర్కొన్నారు. ఇదే సమయంలో కట్ అండ్ పాలిష్ వజ్రాల ఎగుమతులు 2.97 శాతం క్షీణించి రూ. 1,76,696.95 కోట్లుగా ఉన్నాయి. ఇక, మొత్తం ఎగుమతుల్లో బంగారు ఆభరణాల ఎగుమతులు 11.13 శాతం పెరిగి రూ. 75,635.72 కోట్లకు చేరాయి. వెండి ఎగుమతులు 16.02 శాతం పుంజుకుని రూ. 23,492.71 కోట్లకు చేరుకున్నాయని జీజేఈపీసీ వెల్లడించింది.

Tags:    

Similar News