Forex Reserves: ఆరు నెలల కనిష్ట స్థాయికి చేరుకున్న భారత ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు
భారత్ విదేశీ మారక(Forex Reserves) నిల్వలు మరింత పతనం అయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: భారత్ విదేశీ మారక(Forex Reserves) నిల్వలు మరింత పతనం అయ్యాయి. డిసెంబర్ 13తో ముగిసిన వారంలో ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు దాదాపు 2 బిలియన్ డాలర్ల మేర క్షీణించడంతో 652.87 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దీంతో ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు ఆరు నెలల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ నెల 13తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 1.988 బిలియన్ డాలర్లు తగ్గి 652.869 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. సెప్టెంబర్ నెలలో ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 704.885 బిలియన్ డాలర్ల ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకిన సంగతి తెలిసిందే. ఆ తరువాత నుంచి క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఇక గోల్డ్ రిజర్వు(Gold Reserve) నిల్వలు 1.121 బిలియన్ డాలర్లు పతనమై 68.056 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అలాగే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్(SDR) 35 మిలియన్ డాలర్లు క్షీణించి 17.997 బిలియన్ డాలర్ల వద్ద స్థిరపడ్డాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(IMF)లో భారత ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 27 మిలియన్ డాలర్లు తగ్గి 4.24 బిలియన్ డాలర్ల వద్ద నమోదైనట్లు ఆర్బీఐ నివేదిక వెల్లడించింది.