316 శాతం పెరిగిన భారతీయ బొమ్మల ఎగుమతులు!
గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో భారతీయ బొమ్మల పరిశ్రమ ఎగుమతులు గణనీయంగా పెరిగాయని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది.
న్యూఢిల్లీ: గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో భారతీయ బొమ్మల పరిశ్రమ ఎగుమతులు గణనీయంగా పెరిగాయని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజా గణాంకాల ప్రకారం, 2013-14లో పరిశ్రమ ఎగుమతుల విలువ సుమారు రూ. 304 కోట్ల నుంచి 2022-23లో రూ. 1,267 కోట్లకు చేరింది. ఇది 316 శాతం వృద్ధి అని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఆసక్తికరంగా దేశీయ బొమ్మల ఎగుమతులు ప్రతి ఏటా వృద్ధి చెందుతోందని, 2021-22లో రూ. 1,458 కోట్ల గరిష్ట స్థాయికి చేరాయని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో మాత్రమే ఎగుమతులు 13 శాతం క్షీణించాయి. ప్రబుత్వం చేపట్టిన నిర్మాణాత్మక చర్యల ఫలితంగానే దేశీయ బొమ్మల ఎగుమతులు పెరిగాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ప్రభుత్వం బొమ్మలపై దిగుమతి సుంకాన్ని 70 శాతానికి సవరించింది. దీనివల్ల స్థానిక తయారీకి ప్రోత్సాహం లభించింది. అంతేకాకుండా బొమ్మల నాణ్యత కోసం క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్‌ను తీసుకొచ్చింది. ఈ పరిణామాలతో పరిశ్రమ ఎగుమతులు ఊపందుకున్నాయని టాయ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చైర్‌పర్శన్ మను గుప్తా అన్నారు.
అయితే, ఇప్పటికీ దేశంలో చైనా బొమ్మల ఆధిపత్యం కొనసాగుతోంది. అయినప్పటికీ భారతీయ బొమ్మల తయారీదారులు ఉత్పత్తిని పెంచారు. ముఖ్యంగా బొమ్మలు, బోర్డ్ గేమ్‌లు, ఇంకా ఇతర ఆట వస్తువుల ఉత్పత్తిని కంపెనీలు పెంచాయని మను గుప్తా పేర్కొన్నారు.