యూఎస్‌కు 2 రెట్లు పెరిగిన భారత ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు

భారత్ నుంచి ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలో రూ. 55 వేల కోట్లని ఐసీఈఏ ఛైర్మన్ పంకజ్ మహీంద్రూ చెప్పారు.

Update: 2024-02-11 13:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: గతేడాది జనవరి-సెప్టెంబర్ మధ్య భారత్ నుంచి అమెరికాకు ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు రెండు రెట్లు పెరిగాయని పరిశ్రమల సంఘం ఐసీఈఏ తెలిపింది. ఇది భారత్ నుంచి ఆల్‌టైమ్ రికార్డు స్థాయి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులని, విలువ పరంగా సుమారు రూ. 55 వేల కోట్లని ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్(ఐసీఈఏ) ఛైర్మన్ పంకజ్ మహీంద్రూ చెప్పారు. ఇదే సమయంలో చైనా నుంచి యూఎస్‌కు ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల వాటా గణనీయంగా తగ్గిందని ఆయన తెలిపారు. ఇటీవలి డేటాలో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయిన ఎలక్ట్రానిక్స్ అంచనా వేసిన దానికంటే 253 శాతం ఎక్కువని పంకజ్ పేర్కొన్నారు. ఇంతకుముందు 2018లో అంచనా వేసిన దానికంటే 2022లోనూ ఈ ఎగుమతులు 300 శాతానికి పైగా పెరిగాయి.భారత్, యూఎస్ మధ్య ద్వైపాక్షిక ఎలక్ట్రానిక్స్ వాణిజ్యం 84 శాతంతో ఆకట్టుకునే స్థాయిలో పెరుగుదల ఉంది. 'అమెరికాకు ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు పెరగడం ప్రపంచ ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌లో భారత్ సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఇది మరింత పెరుగుతుందని, ముఖ్యంగా రాబోయే 3-5 ఏళ్లలో స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు ఐదు రెట్ల వృద్ధిని సాధించవచ్చని' ఇండో-యుఎస్ టాస్క్ ఫోర్స్ ఆన్ ఎలక్ట్రానిక్స్ ఛైర్మన్ ఆర్‌ఎస్ శర్మ పేర్కొన్నారు. 

Tags:    

Similar News