India-Oman: ఎఫ్‌వై24లో $8 బిలియన్లుగా భారత్-ఒమన్ ద్వైపాక్షిక వాణిజ్యం

భారత్-ఒమన్ మధ్య 2024 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్యం $8 బిలియన్లుగా నమోదైందని ఒమన్‌లోని భారత రాయబారి అమిత్ నారంగ్ మంగళవారం అన్నారు.

Update: 2024-08-27 11:32 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్-ఒమన్ మధ్య 2024 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్యం $8 బిలియన్లుగా నమోదైందని ఒమన్‌లోని భారత రాయబారి అమిత్ నారంగ్ మంగళవారం అన్నారు. న్యూఢిల్లీలో ఫిక్కీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, భారత్-ఒమన్ మధ్య ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కోసం చర్చలు అధునాతన దశలో ఉన్నాయి, ఒప్పందాన్ని ముందుగానే ముగించాలని ఇరుపక్షాలు భావిస్తున్నాయి. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలకు గణనీయమైన ప్రోత్సాహాం ఇస్తుందని అన్నారు.

పెట్రోలియం ఉత్పత్తులు, వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, యంత్రాలు, ఇనుము, ఉక్కుపై సుంకాలను తొలగించడం ద్వారా పశ్చిమ ఆసియా దేశానికి భారతీయ ఎగుమతులను పెంచుకునే అవకాశం కలుగుతుందని నారంగ్ చెప్పారు. 2022-23లో 12 బిలియన్ డాలర్లు దాటిన భారత్-ఒమన్ ద్వైపాక్షిక వాణిజ్యం ఎఫ్‌వై 24లో 8 బిలియన్ డాలర్లుగా స్థిరపడిందని అన్నారు.

ఇదే కార్యక్రమంలో యుఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ మాట్లాడుతూ, భారతదేశం త్వరలో GCC (గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్)తో కృత్రిమ మేధస్సు, ఆరోగ్య సంరక్షణ, అంతరిక్ష సాంకేతికత వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో సహకరించుకోడానికి అవకాశం ఏర్పడిందని అన్నారు. భారత్ ఒమన్ నుండి చమురు, ఎరువులను దిగుమతి చేసుకుంటుంది. ఒమన్‌కు భారతీయ ఎగుమతుల్లో ఎక్కువ భాగం నేరుగా కాకుండా యుఏఈ ద్వారా వెళ్తుంటాయి.


Similar News