ఈ ఏడాది రూ.లక్ష కోట్ల విలువైన మొబైల్ ఫోన్ల ఎగుమతి
గత పదేళ్లలో మొబైల్ ఫోన్ల ఉత్పత్తి పరంగా భారత్ గణనీయమైన వృద్ధిని సాధించింది
దిశ, బిజినెస్ బ్యూరో: గత పదేళ్లలో మొబైల్ ఫోన్ల ఉత్పత్తి పరంగా భారత్ గణనీయమైన వృద్ధిని సాధించింది. 2014లో దేశంలో విక్రయించిన మొత్తం మొబైల్ ఫోన్‌లలో 78 శాతం దిగుమతి చేసుకోగా, ఇప్పుడు 97 శాతం మొబైల్ ఫోన్‌లు భారత్‌లోనే తయారవుతున్నాయని ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ICEA) నివేదిక పేర్కొంది. డేటా ప్రకారం, మొబైల్ ఫోన్ ఉత్పత్తి విలువ 2014-15లో రూ.18,900 కోట్లు కాగా 2024లో 20 రెట్లు పెరిగి రూ.4.10 లక్షల కోట్లకు చేరుకుంది. గత పదేళ్లలో దేశంలో 245 కోట్లకు పైగా మొబైల్ ఫోన్లు ఉత్పత్తి చేయడం జరిగింది.
2014-15లో భారత్ నుంచి మొబైల్ ఫోన్ ఎగుమతుల విలువ కేవలం రూ.1,556 కోట్లు మాత్రమే కాగా, 2024 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అది రూ.1,20,000 కోట్లకు చేరుకుంటుందని నివేదిక అంచనా వేసింది. 2014లో భారత్‌లో కేవలం రెండు మొబైల్ ఫ్యాక్టరీలు ఉండగా, ప్రస్తుతం చాలా పరిశ్రమల ఏర్పాటుతో దేశం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ ఉత్పత్తిదారుగా అవతరించింది.
శాంసంగ్ నోయిడాలో ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఫోన్ ఫ్యాక్టరీని నిర్వహిస్తోంది. మరోవైపు యాపిల్ కూడా కొత్త ప్లాంట్‌లను ఏర్పాటుచేసింది. భారత్‌లో తయారైన పరికరాలను ఉత్తర ఆఫ్రికా, దక్షిణ అమెరికా, UK, నెదర్లాండ్స్, ఆస్ట్రియా వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. పెరుగుతున్న ఎగుమతి మార్కెట్‌తో, భారత్ మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్స్ తయారీ ఔట్‌లుక్ ఆరోగ్యకరంగా ఉందని నిపుణులు పేర్కొన్నారు.