మొబైల్‌ఫోన్ తయారీ రంగంలో 2.50 లక్షల ఉద్యోగాలు
ప్రత్యక్ష, పరోక్షంగా 1.50 లక్షల నుంచి 2.50 లక్షల ఉద్యోగాల సృష్టికి అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో వేగంగా పెరుగుతున్న మొబైల్‌ఫోన్ తయారీ పరిశ్రమలో రానున్న 12-16 నెలల వ్యవధిలో భారీగా ఉద్యోగాలు లభిస్తాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యక్ష, పరోక్షంగా 1.50 లక్షల నుంచి 2.50 లక్షల ఉద్యోగాల సృష్టికి అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ భారత్‌లో తన మూడు కాంట్రాక్ట్ తయారీ కంపెనీలైన ఫాక్స్‌కాన్, విస్ట్రాన్, పెగాట్రాన్ దేశీయ, ఎగుమతి డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని పెద్ద ఎత్తున ఉద్యోగులను తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ కంపెనీలు ముఖ్యంగా చైనాకు వెలుపల యాపిల్ తయారీ పెంచే లక్ష్యంలో భాగంగా ఈ విషయంలో దూకుడుగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ప్రముఖ స్టాఫింగ్ సర్వీసెస్ సంస్థ టీమ్‌లీజ్ ప్రకారం, గడిచిన మూడేళ్లలో భారత ప్రభుత్వ పీఎల్ఐ పథకం ఈ రంగంలో సుమారు 5 లక్షల ఉద్యోగాల సృష్టికి సహాయపడింది. చైనాకు బయట తయారీ సామర్థ్యాన్ని పెంచే ఉద్దేశ్యంతో ఉన్న విడి పరికరాల తయారీదారులకు భారత ప్రభుత్వం 2025-26 నాటికి 300 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తిని చేపట్టే అవకాశం కల్పించిందని టీమ్‌లీజ్ సర్వీసెస్ సీఈఓ కార్తీక్ నారాయణ్ అన్నారు. దీనికి డిజిటలైజేషన్, మౌలిక సదుపాయాల ఏర్పాటు వంటి అంశాలు సులభతరం చేసింది. ప్రపంచస్థాయిలో మొబైల్ వినియోగదారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇవన్నీ రాబోయే సంవత్సరాల్లో తయారీ డిమాండ్‌ను పెంచుతాయని ఆయన పేర్కొన్నారు.