మ్యాగీ నూడుల్స్‌కు అతిపెద్ద మార్కెట్‌గా భారత్.. ఏడాదిలో 600 కోట్ల అమ్మకాలు

అంతేకాకుండా రెండంకెల వృద్ధితో భారత్ అత్యంత వేగవంతమైన మార్కెట్‌గా ఉందని నెస్లె ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది.

Update: 2024-06-18 13:45 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరంలో భారీగా ఇన్‌స్టంట్ నూడుల్స్‌ను విక్రయించడం ద్వారా నెస్లే మ్యాగీకి భారత్ అతిపెద్ద మార్కెట్‌గా అవతరించింది. ఈ మేరకు కంపెనీ తన వార్షిక నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా రెండంకెల వృద్ధితో భారత్ అత్యంత వేగవంతమైన మార్కెట్‌గా ఉందని నెస్లె ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా కంపెనీ ఫ్లాగ్‌షిప్ బ్రాండ్ మ్యాగీ నూడుల్స్ ఇతర దేశాలతో పోలిస్తే భారత్ కీలకంగా ఉంది. మ్యాగీ నూడుల్స్‌కు సంబంధించి 2023-24 ఆర్థిక సంవత్సరంలో నెస్లె కంపెనీ 600 కోట్ల కంటే ఎక్కువ మ్యాగీలను విక్రయించింది. ముఖ్యంగా మ్యాగీ పరిమాణం, ధర, రుచికి సంబంధించిన వివిధ కారణాలతో మ్యాగీ అమ్మకాలు అత్యధికంగా జరిగాయని నెస్లె ఇండియా పేర్కొంది. అయితే, మ్యాగీ నూడుల్స్ విషయంలో కంపెనీ అనేక వివాదాలను కూడా ఎదుర్కొంది. 2015 జూన్‌లో మ్యాగీ నూడుల్స్ ఇన్‌స్టంట్ నూడుల్స్‌లో అనుమతించిన మొత్తం కంటే అధిక సీసం ఉందనే ఆరోపణలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎసేఐ) ఐదు నెలల నిషేధం విధించింది. సీసం అనేది మనుషులకు, జంతువులకు తీవ్ర విషపూరిత రసాయన మూలకం. నిషేధం కారణంగా భారత నూడుల్స్ మార్కెట్‌లో మ్యాగీ వాటా 80 శాతం తగ్గింది. తిరిగి మార్కెట్లోకి వచ్చిన తర్వాత వాటా పెంచుకున్నప్పటికీ అంతకుముందు ఉన్న స్థాయికి ఇంకా చేరుకోలేకపోతోంది. ఇక, నెస్లె ఇండియా పోర్ట్‌ఫోలియోలో మరొక ఫుడ్ ప్రోడక్ట్ కిట్‌క్యాట్‌లు సైతం గత ఆర్థిక సంవత్సరంలో 420 కోట్ల బార్స్‌ను విక్రయించింది. కిట్‌క్యాట్ అమ్మకాలకు కూడా మనదేశం రెండో అతిపెద్ద మార్కెట్‌గా ఉంది.  

Similar News