జీ ఎంటర్‌టైన్‌మెంట్ చైర్మన్‌కు బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు

నిధుల మళ్లింపుకు సంబంధించిన కేసులో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కోరిన పత్రాలను సమర్పించాలని జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎమెరిటస్ చైర్మన్ సుభాష్ చంద్రను బాంబే హైకోర్టు బుధవారం ఆదేశించింది.

Update: 2024-06-26 12:43 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: నిధుల మళ్లింపుకు సంబంధించిన కేసులో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కోరిన పత్రాలను సమర్పించాలని జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎమెరిటస్ చైర్మన్ సుభాష్ చంద్రను బాంబే హైకోర్టు బుధవారం ఆదేశించింది. 2023 జూన్‌లో జీ కంపెనీ నుంచి రూ.200 కోట్లను అక్రమంగా మళ్లించారని ఆయనపై సెబీ కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా సుభాష్ చంద్రకు సెబీ పలుమార్లు సమన్లు ​జారీ చేసింది. అయితే ఆ సమన్లపై చంద్ర స్పందించలేదని దర్యాప్తును నిలిపివేసేందుకు ప్రయత్నిస్తున్నారని సెబీ ఆరోపించింది.

దీనిపై స్పందించిన ఆయన, సమన్లు సెబీ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా లేవని, అవి ​పక్షపాతంగా, అన్యాయంగా, ఏకపక్షంగా, షోకాజ్ నోటీసు తరహాలో ఉన్నాయని దర్యాప్తును సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే బుధవారం ఇరుపక్షాల వాదనలు విన్న బాంబే హైకోర్టు, ఇటీవలి మార్చి 27న జారీ చేసిన సమన్లపై చంద్ర స్పందించాల్సిన అవసరం ఉందని, జనవరి 12 కంటే ముందు వచ్చిన సమన్లపై కాదని, సెబీ కోరిన పత్రాలను తప్పనిసరిగా అందించాలని ధర్మాసనం తన ఆదేశాల్లో పేర్కొంది.

Similar News