లిథియం కోసం ఆఫ్రికా, లాటిన్ అమెరికాలతో చర్చలు జరుపుతున్న భారత్

దేశీయంగా అభివృద్ది చెందుతున్న విండ్ టర్బైన్లు, విద్యుత్ నెట్‌వర్క్‌లు, ఎలక్ట్రిక్ వాహనాలతో సహా ఇతర స్వచ్ఛమైన శక్తి సాంకేతికత

Update: 2024-07-02 09:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయంగా అభివృద్ది చెందుతున్న విండ్ టర్బైన్లు, విద్యుత్ నెట్‌వర్క్‌లు, ఎలక్ట్రిక్ వాహనాలతో సహా ఇతర స్వచ్ఛమైన శక్తి సాంకేతికతలో అవసరం అయ్యే ముఖ్యమైన లిథియం ఖనిజం కోసం భారత్.. ఆఫ్రికా, లాటిన్ అమెరికాలతో చర్చలు జరుపుతుందని గనుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి వీణా కుమారి డెర్మల్ మంగళవారం తెలిపారు. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పునరుత్పాదక శక్తికి డిమాండ్ పెరిగింది. దీంతో లిథియం వాడకం ఎక్కువగా ఉండడంతో అవసరాల కోసం ఇతర దేశాలతో సంప్రదింపులు చేస్తుంది. జీ2జీ ప్రాతిపదికన బ్లాక్‌ను పొందడం కోసం ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని అనేక ఇతర దేశాలతో చాలా చర్చలు జరుపుతున్నామని ఇండియా ఎనర్జీ స్టోరేజ్ వీక్ (IESW) 2024లో డెర్మల్ చెప్పారు.

కొత్త బ్లాక్‌లను భారత్ దక్కించుకున్నట్లుయితే దేశీయంగా లిథియం కొరత తీరుతుందని ఆమె అన్నారు. మరోవైపు దేశీయంగా కూడా లిథియం ఖనిజం ఉత్పత్తిపై దృష్టి పెట్టినట్లు కార్యదర్శి తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వం ఒక లిథియం బ్లాక్‌ను విజయవంతంగా వేలం వేసిందని, దాని నుంచి ఉత్పత్తిని త్వరగా ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే పలు దఫాలుగా కేంద్రం ఖనిజాల వేలాన్ని నిర్వహించింది. జూన్‌లో, కీలకమైన, వ్యూహాత్మక ఖనిజాల నాలుగో రౌండ్ వేలంలో ప్రభుత్వం 21 బ్లాకులను విక్రయించింది.

Similar News