80 వేల పైన ముగిసిన సెన్సెక్స్

అంతకుముందు సెషన్‌లో రికార్డు ర్యాలీ నమోదైన తర్వాత గురువారం సూచీలు సరికొత్త గరిష్ఠాలకు చేరాయి.

Update: 2024-07-04 12:00 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో రికార్డు లాభాలు కొనసాగుతున్నాయి. అంతకుముందు సెషన్‌లో రికార్డు ర్యాలీ నమోదైన తర్వాత గురువారం సూచీలు సరికొత్త గరిష్ఠాలకు చేరాయి. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, భారత మార్కెట్లపై విదేశీ ఇన్వెస్టర్ల ఆసక్తి, ప్రభుత్వ వ్యయం వంటి అంశాలు ఈక్విటీల లాభాలకు కారణమయ్యాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభం నుంచే కొత్త ఆల్‌టైమ్ హై స్థాయికి తాకిన సూచీలు మిడ్-సెషన్ తర్వాత నుంచి లాభాలు నెమ్మదించాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 62.87 పాయింట్లు లాభపడి 80,049 వద్ద, నిఫ్టీ 15.65 పాయింట్ల లాభంతో 24,302 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఫార్మా, ఐటీ, హెల్త్‌కేర్ రంగాలు 1 శాతానికి పైగా పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హెచ్‌సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, సన్‌ఫార్మా, టీసీఎస్, ఇన్ఫోసిస్, కోటక్ బ్యాంక్ షేర్లు లాభాలను సాధించాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎల్అండ్‌టీ, టెక్ మహీంద్రా, ఆల్ట్రా సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.51 వద్ద ఉంది. 


Similar News