oil imports: చమురు దిగుమతులను పెంచేందుకు బ్రెజిల్‌తో భారత్ చర్చలు

భారత్ తన అవసరాల కోసం చమురు దిగుమతులను పెంచడానికి ఎక్కువ దృష్టి పెట్టింది.

Update: 2024-09-20 08:51 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్ తన అవసరాల కోసం చమురు దిగుమతులను పెంచడానికి ఎక్కువ దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో బ్రెజిల్‌తో భారత్ చర్చలు జరుపుతోంది, ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి శుక్రవారం తెలిపారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి జరుగుతున్న చర్చల్లో ప్రముఖంగా చమురు అంశం గురించి మాట్లాడుకున్నారు. ఈ మేరకు పూరీ బ్రెసిలియాలోని పెట్రోబ్రాస్ ప్రెసిడెంట్, మగ్దా చాంబ్రియార్డ్‌తో హర్దీప్ సింగ్ పూరి సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య ముడి చమురు కొనుగోళ్లను మరింత మెరుగుపరచడానికి, ఆఫ్‌షోర్ డీప్ ఎక్స్‌ప్లోరేషన్, ప్రొడక్షన్ ప్రాజెక్ట్‌లలో సహకరించే అవకాశాల గురించి చర్చించారు. అలాగే బ్రెజిల్‌లో భారత పెట్టుబడుల గురించి కూడా మాట్లాడుకున్నారు.

బ్రెజిల్ ప్రపంచంలోని అతిపెద్ద వ్యవసాయ ఉత్పత్తిదారులలో ఒకటి. ఇది ఇథనాల్, కూరగాయల నూనె- బయోడీజిల్ వంటి జీవ ఇంధనాల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా విమానయాన ఇంధనాల అభివృద్ధిలో కూడా ఈ రెండు దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఈ సమావేశంలో పెట్రోబ్రాస్ ప్రెసిడెంట్‌ను ఫిబ్రవరి 11 నుండి 14, 2025 వరకు ఢిల్లీలో నిర్వహించనున్న ఇండియా ఎనర్జీ వీక్‌లో పాల్గొనవలసిందిగా ఆహ్వనించినట్లు మంత్రి తెలిపారు. ఇదిలా ఉంటే, ఇండియన్ ఆయిల్ గతంలో పెట్రోబ్రాస్‌తో సంవత్సరానికి 1.7 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీపీఏ) ముడి చమురు కోసం దీర్ఘకాలిక సరఫరా ఒప్పందంపై సంతకం చేసింది.


Similar News