ఎయిర్‌బస్ నుంచి 250 విమానాల కొనుగోలుకు టాటా గ్రూప్ ఒప్పందం!
టాటా గ్రూప్ ప్రపంచ విమానయాన చరిత్రలోనే అతిపెద్ద కొనుగోలు ఒప్పందాన్ని చేసుకుంది.
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ ప్రపంచ విమానయాన చరిత్రలోనే అతిపెద్ద కొనుగోలు ఒప్పందాన్ని చేసుకుంది. గ్లోబల్ దిగ్గజ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్ నుంచి 250 విమానాలను కొనుగోలు చేయనున్నట్టు టాటా చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మంగళవారం ప్రకటించారు. అందులో 40 ఏ350 వైడ్-బాడీ లాంగ్-రేంజ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, 210 నారో బాడీ విమానాలు ఉన్నాయి. కొత్త మార్గాల్లో విమానాలను నడిపేందుకు వీలుగా వీటిని కొనుగోలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.
'తాము ఎయిర్‌బస్‌తో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాం. సంస్థ నుంచి 250 విమానాలను కొనేందుకు ఒప్పందంపై సంతకం చేశామని ప్రకటించడానికి సంతోషిస్తున్నానని' చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ఎయిర్ఇండియా పునరుద్ధరణకు సహాయంగా ఈ ఒప్పందం జరగడంతో ఎయిర్‌బస్‌కు చారిత్రాత్మక సందర్భంగా భావిస్తున్నామని ఎయిర్‌బస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గుయిలౌమ్ ఫౌరీ చెప్పారు. టాటా గ్రూప్ మొత్తం 470 కొత్త విమానాలను కొనేందుకు సిద్ధమవుతున్న గతంలో ప్రకటించింది.
అందులో భాగంగా ఎయిర్‌బస్‌తో 250 విమానాల కోసం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పంద కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భారత ప్రధాని నరేంద్ర మోదీ, రతన్ టాటా, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్‌తో పాటు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, జ్యోతిరాధిత్య సింధియా పాల్గొన్నారు. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాల్లో ఈ ఒప్పందం కీలక మైలురాయిగా ఉంటుందని ఇమాన్యుయేల్ అన్నారు. విమానయాన రంగంలో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశంగా అవతరిస్తుందని మోదీ చెప్పారు. రాబోయే 15 ఏళ్లలో భారత్‌కు 2,500 విమానాలు అవసరమవుతాయన్నారు.