తొలగింపులు ఉన్నా సరే ఫిబ్రవరిలో 10 శాతం పెరిగిన ఐటీ నియామకాలు!

గత కొంతకాలంగా కొనసాగుతున్న తొలగింపుల ధోరణి మధ్య భారత టెక్ కంపెనీలు నియామకాలను పెంచే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయని ఓ నివేదిక వెల్లడించింది.

Update: 2023-03-01 17:05 GMT

న్యూఢిల్లీ: గత కొంతకాలంగా కొనసాగుతున్న తొలగింపుల ధోరణి మధ్య భారత టెక్ కంపెనీలు నియామకాలను పెంచే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. వేలాదిగా లేఆఫ్స్ ప్రకటిస్తున్న సమయంలో ఇది ఊరట కలిగించే అంశమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రముఖ జాబ్‌సైట్ నౌక్రీ జాబ్‌స్పీ నివేదిక ప్రకారం, ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత ఐటీ కంపెనీలు 10 శాతం ఎక్కువ నియామకాలు చేపట్టాయి. ఐటీతో సహా మొత్తం నియామకాల వృద్ధి సైతం 9 శాతంగా ఉంది.

ఐటీ పరిశ్రమలో ముఖ్యంగా కీలకమైన అనలిటిక్స్, బిగ్‌డేటా ఇంజనీరింగ్, క్లౌడ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌ వంటి విభాగాల్లో ఉద్యోగులకు భారీ డిమాండ్ ఉందని, వీటి తర్వాత డెవలప్‌మెంట్, డెవలప్‌మెంట్ ఇంజనీరింగ్ విభాగాలకు అధిక డిమాండ్ ఉన్నట్టు నివేదిక తెలిపింది. గతంలో అత్యధిక గిరాకీ కనిపించిన సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, డేటా సైంటిస్టుల నియామకాలు కొంత నెమ్మదించినప్పటికీ రెండంకెల స్థాయిలో నియామకాలు పెరగడం విశేషం.

ఇక, మిగిలిన రంగాల్లో రియల్ ఎస్టేట్, ఆతిథ్య, హెల్త్‌కేర్ సంస్థల్లో కూడా రెండంకెల వృద్ధి నమోదైంది. బ్యాంకింగ్, బీపీఓ, రిటైల్ రంగాల్లో మెరుగైన నియామకాలు నమోదయ్యాయి. ప్రధానంగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, పూణె నగరాల్లో ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నివేదిక పేర్కొంది.

Tags:    

Similar News