Highest Inflation country | ద్రవ్యోల్బణం రేటు 264%!.. ఏ దేశంలో తెలుసా?
పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల ఇబ్బంది పడుతున్నది భారత దేశ ప్రజలు మాత్రమే కాదు. ప్రపంచంలో చాలా దేశాలు దీని వల్ల తీవ్రంగా నష్టపోతున్నాయి. దీని ప్రభావం ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తోంది. మన దేశంలో 5.6 శాతం ద్రవ్యోల్బణానికే ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే.. కొన్ని దేశాల్లో ద్రవ్యోల్బణం రెండంకెల్లో ఉంది. ఇంకొన్ని దేశాల్లో 3 అంకెలకు కూడా చేరుకుంది.
దిశ, వెబ్ డెస్క్ : పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల ఇబ్బంది పడుతున్నది భారత దేశ ప్రజలు మాత్రమే కాదు. ప్రపంచంలో చాలా దేశాలు దీని వల్ల తీవ్రంగా నష్టపోతున్నాయి. దీని ప్రభావం ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తోంది. మన దేశంలో 5.6 శాతం ద్రవ్యోల్బణానికే ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే.. కొన్ని దేశాల్లో ద్రవ్యోల్బణం రెండంకెల్లో ఉంది. ఇంకొన్ని దేశాల్లో 3 అంకెలకు కూడా చేరుకుంది. ద్రవ్యోల్బణం రేటు ఏకంగా 264 శాతానికి చేరిన ఒక దేశం మన ఆసియా ఖండంలోనే ఉంది.ఉంది.
అత్యధిక ద్రవ్యోల్బణం రేటు కలిగిన దేశం
ఆసియా దేశాల్లో అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న దేశం లెబనాన్ (Lebanon). 2023 మార్చి వరకు ఉన్న డేటా ప్రకారం, లెబనాన్‌లో ద్రవ్యోల్బణం రేటు 264 శాతానికి చేరుకుంది. అంతకుముందు నెల ఫిబ్రవరిలో ఈ సంఖ్య 190 శాతంగా ఉంది. లెబనాన్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరి నుంచి మార్చి వరకు ఏకంగా 74 శాతం పెరిగింది. అంటే, నెల రోజుల వ్యవధిలోనే లెబనాన్‌లో వస్తువుల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటాయి. ఈ ద్రవ్యోల్బణం రేటు పెరుగుదల కారణంగా, నిత్యావసరాలు కూడా కొనుక్కోలేక లెబనాన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆసియాలో అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న దేశాల జాబితా
అధిక ద్రవ్యోల్బణం ఎపిసోడ్‌లో లెబనాన్ పేరు తొలి స్థానంలో ఉంది. సిరియా (Syria) రెండో స్థానంలో ఉంది, ఇక్కడ ద్రవ్యోల్బణం రేటు 139 శాతానికి చేరుకుంది. 53.4 శాతం ద్రవ్యోల్బణ రేటుతో, ఈ లిస్ట్‌లో ఇరాన్ (Iran) మూడో స్థానంలో ఉంది. దీని తర్వాత లావోస్ (Laos) పేరు ఉంది. అయితే, ఒకవైపు అన్ని దేశాల ద్రవ్యోల్బణం రేటు పెరుగుతూ ఉంటే, మరోవైపు లావోస్ ద్రవ్యోల్బణం రేటు గత నివేదికతో పోలిస్తే 0.29 శాతం తగ్గింది. లావోస్ తర్వాత, భారతదేశ పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan) పేరు ఐదో స్థానంలోకి చేరింది. ఇక్కడ ఏప్రిల్ నెలలో ద్రవ్యోల్బణం రేటు 36.4 శాతానికి చేరుకుంది.
భారతదేశంలో ద్రవ్యోల్బణం రేటు
భారతదేశ ద్రవ్యోల్బణం రేటును (Inflation in India) చూస్తే, ఫిబ్రవరి నెలతో పోలిస్తే మార్చి నెల గణాంకాలలో తగ్గుదల కనిపించింది. ఫిబ్రవరిలో భారత ద్రవ్యోల్బణం 6.44 శాతంగా ఉంది. మార్చి నెలలో 0.98 శాతం తగ్గి 5.66 శాతానికి చేరుకుంది. రిజర్వ్ బ్యాంక్ గరిష్ట లక్ష్యమైన 6 శాతం లోపే నమోదైంది.
2023 మార్చి నెలలో, భారతదేశంలో వినియోగదారు ధరల సూచీ (CPI) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం (Retail Inflation) 5.66 శాతంగా నమోదైంది. ఇది 15 నెలల కనిష్ట స్థాయి. అయినా, పెరిగిన ధరలను భరించలేక భారత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అంతకుముందు ఫిబ్రవరి నెలలో 6.44 శాతంగా, జనవరిలో 6.52 శాతంగా ఉంది. దీనిని తగ్గించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నానా ప్రయత్నాలు చేస్తోంది.
భారతదేశ పొరుగు దేశాల్లో ద్రవ్యోల్బణం
భారతదేశానికి మరో పక్కన ఉన్న నేపాల్ ద్రవ్యోల్బణం రేటు 7.44 శాతం. మరో పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో ద్రవ్యోల్బణం 8.78 శాతం నుంచి 9.33 శాతానికి పెరిగింది. ఆర్థికంగా గడ్డు పరిస్థితుల నుంచి బయటపడుతున్న శ్రీలంక, ద్రవ్యోల్బణ బాధిత దేశాల జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది. నివేదిక ప్రకారం, ఏప్రిల్ నెలలో శ్రీలంక ద్రవ్యోల్బణం రేటు 35.3 శాతంగా ఉంది, అంతకుముందు ముందు నెలతో పోలిస్తే దాదాపు 15 శాతం మెరుగుపడింది.
ఇవి కూడా చదవండి : $800 మిలియన్ల రుణాలను తిరిగి చెల్లించిన వేదాంత