దేశవ్యాప్తంగా డజను పారిశ్రామిక పార్కులు.. మంత్రివర్గ సమావేశంలో చర్చ
పెట్టుబడులను ఆకర్షించేందుకు, ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా కోట్లాది రూపాయల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి కేంద్రం సిద్ధమైంది
దిశ, బిజినెస్ బ్యూరో: పెట్టుబడులను ఆకర్షించేందుకు, ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా కోట్లాది రూపాయల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి కేంద్రం సిద్ధమైంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా తయారీని పెంచడానికి, ఉపాధి అవకాశాలను కల్పించడానికి రూ.1.50 లక్షల కోట్లతో డజను పారిశ్రామిక పార్కులను ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో ప్రాజెక్టుల ఏర్పాటు ప్రతిపాదనపై చర్చ జరగ్గా దీనికి ఆమోదం లభించే అవకాశం ఉందని సంబంధిత వర్గాల వారు తెలిపారు. ప్రతిపాదిత పారిశ్రామిక పార్కులు దేశవ్యాప్తంగా ప్రాంతీయ తయారీ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారిస్తాయి. ఫుడ్ ప్రాసెసింగ్, స్పెషలైజ్డ్ టెక్స్‌టైల్స్, లాజిస్టిక్స్, టూరిజం, ఎలక్ట్రిక్ వాహనాల వంటి రంగాలను ప్రోత్సహిస్తుంది. ఇప్పటికే భూసేకరణ పూర్తయి ప్రాథమిక నియంత్రణ అనుమతులు లభించినందున ప్రాజెక్టులు ఆలస్యం లేకుండా తొందరగానే ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.
ఇటీవల 2024–25 సంవత్సరానికి బడ్జెట్‌ను సమర్పిస్తున్న సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద పన్నెండు ఇండస్ట్రియల్ పార్కులను మంజూరు చేస్తామని అన్నారు. ఇప్పుడు దానికి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించే అవకాశం ఉంది. ప్రతిపాదిత పార్కులు ఉత్తరప్రదేశ్, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, పంజాబ్, ఉత్తరాఖండ్ వంటి దేశ నలుమూలల రాష్ట్రాల్లో ఉంటాయి.