కొత్త గరిష్ఠాలకు బంగారం ధరలు

దేశంలో బంగారం ధరలు కొత్త గరిష్ఠాలకు చేరుతున్నాయి. అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ ఊపందుకుంటున్న నేపథ్యంలో భారత్‌లో ధరలు క్రమంగా పెరుగుతూ రూ. 64 వేల మార్కును అధిగమించాయి....

Update: 2023-12-28 16:02 GMT

న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలు కొత్త గరిష్ఠాలకు చేరుతున్నాయి. అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ ఊపందుకుంటున్న నేపథ్యంలో భారత్‌లో ధరలు క్రమంగా పెరుగుతూ రూ. 64 వేల మార్కును అధిగమించాయి. గురువారం హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ. 430 పెరిగి రూ. 64,250కి చేరింది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పది గ్రాములు రూ. 400 పెరిగి రూ. 58,900గా ఉంది. ఇదే నెల మొదటి వారంలో బంగారం ఆల్‌టైమ్ గరిష్ఠం రూ. 64,300 తాకిన తర్వాత మళ్లీ రికార్డు స్థాయికి చేరడం రెండోసారి. 24 క్యారెట్ల పసిడి అత్యధికంగా చెన్నైలో పది గ్రాములు రూ. 64,850 వద్ద ఉంది. వెండి కిలో రూ. 81,000 వద్ద ఉంది. 2024లో అమెరికా ఫెడ్ కీలక రేట్లలో కోత విధించనున్నట్టు వచ్చిన సంకేతాలతో డాలర్‌తో పాటు అమెరికా ట్రెజరీ బాండ్ల విలువ క్షీణించింది.

ఈ క్రమంలో ఇన్వెస్టర్లు కమొడిటీలపై పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 2,080 డాలర్లకు చేరుకోగా, వెండి ఔన్సు ధర 24.31 డాలర్లుగా ఉంది. భౌగోళిక రాజకీయ పరిస్థితులు, వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకుల చర్యలు, డాలర్ ఇండెక్స్‌లో హెచ్చుతగ్గులు, అమెరికా దిగుబడుల ప్రభావం కారణంగా 2023లో విలువైన లోహం గణనీయంగా పెరిగిది. గతేడాదితో పోలిస్తే బంగారం ధరలు 13-14 శాతం పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. 

Tags:    

Similar News