FPI: భారత IT స్టాక్‌లను భారీగా కొనుగోలు చేస్తున్న విదేశీ పెట్టుబడిదారులు

భారత ఐటీ రంగం మెరుగ్గా ఉండటంతో విదేశీ పెట్టుబడిదారుల చూపు ఈ కేటగిరిపై ఎక్కువగా పడింది.

Update: 2024-08-07 08:25 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఐటీ రంగం మెరుగ్గా ఉండటంతో విదేశీ పెట్టుబడిదారుల చూపు ఈ కేటగిరిపై ఎక్కువగా పడింది. తాజాగా నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ (NSDL) వచ్చిన నివేదిక ప్రకారం, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (FPIలు) జులై నెలలో $1.40 బిలియన్ల విలువైన భారతీయ ఐటీ స్టాక్‌లను కొనుగోలు చేశారు. ఇది 2022 తర్వాత అత్యధికం కావడం గమనార్హం. సెప్టెంబరులో అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఉండటం, అలాగే, ఇటీవల కాలంలో భారత ఐటీ కంపెనీల ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో ఎఫ్‌ఐలు ఐటీ షేర్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరిచారని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. విదేశీ ఇన్‌ఫ్లోల కారణంగా, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ జులైలో దాదాపు 13 శాతం లాభపడింది, ఇది ఆగస్టు 2021 నుండి దాని అత్యుత్తమ నెలవారీ పనితీరుగా నిలిచింది.

ముఖ్యంగా జూన్ త్రైమాసికంలో నిర్వహణ పనితీరులో పుంజుకోవడం, మెరుగైన డీల్ మార్పిడి రేట్లు FPI ఆసక్తిని పెంచడానికి దోహదపడ్డాయి. దేశీయ దిగ్గజ కంపెనీలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్ వంటి ప్రముఖ ఐటీ కంపెనీలు జూన్-త్రైమాసిక అంచనాలను అధిగమించి సానుకూల అంచనాలను అందించాయి. ఐటీ రంగం కాకుండా ఆటోమొబైల్, మెటల్స్, క్యాపిటల్ గూడ్స్ రంగాలలో స్థిరమైన ఆదాయాలు ఊపందుకోవడంతో కూడా ఎఫ్‌పీఐలు తమ హోల్డింగ్‌లను పెంచారు. NSDL డేటా ప్రకారం, జులైలో భారతీయ మార్కెట్లలో మొత్తం ఎఫ్‌పీఐ ఇన్‌ఫ్లోలు నాలుగు నెలల గరిష్ట స్థాయి 323.65 బిలియన్ రూపాయలకు పెరిగాయి.

Tags:    

Similar News