FPI: రుణ విభాగంలో పెరుగుతున్న విదేశీ పెట్టుబడులు.. రూ.1లక్ష కోట్ల మార్కు
రుణ విభాగంలో విదేశీ పెట్టుబడులు క్రమంగా పెరుగుతున్నాయి
దిశ, బిజినెస్ బ్యూరో: రుణ విభాగంలో విదేశీ పెట్టుబడులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా విడుదలైన డేటా ప్రకారం, ఈ నెలలో ఇప్పటివరకు(ఆగస్టు 24 నాటికి) విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) భారతీయ రుణ(డెట్) మార్కెట్‌లో రూ.11,366 కోట్ల పెట్టుబడులు పెట్టారు. దీంతో రుణ విభాగంలో 2024లో ఇప్పటివరకు నికర ఇన్‌ఫ్లో రూ.1లక్ష కోట్ల మార్కుకు చేరుకుంది. ఈ ఏడాది జూన్‌లో JP మోర్గాన్ ఎమర్జింగ్ మార్కెట్‌లో భారత బాండ్లను చేర్చడం ద్వారా దేశీయ రుణ విభాగంలో విదేశీ పెట్టుబడిదారుల బలమైన కొనుగోళ్లు జరిపారని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
అంతకుముందు జులైలో రుణ మార్కెట్లోకి రూ. 22,363 కోట్లు, జూన్‌లో రూ. 14,955 కోట్లు, మేలో రూ. 8,760 కోట్ల నికర పెట్టుబడులు వచ్చాయి. అయితే అంతకు ముందు ఏప్రిల్‌లో రూ.10,949 కోట్లు వెనక్కి తీసుకోవడం గమనార్హం. ఆ తరువాత నుంచి ఎఫ్‌పీఐలు పెట్టుబడులను పెట్టడం కొనసాగిస్తున్నారు. నిపుణలు పేర్కొన్నదాని ప్రకారం, అక్టోబరు 2023లో JP మోర్గాన్ ఎమర్జింగ్ ఇండెక్స్‌లో భారత్‌ను త్వరలో చేరుస్తామని ప్రకటన వెలువడినప్పటి నుంచి ఎఫ్‌పీఐలు భారతీయ డెట్ మార్కెట్‌లలో తమ పెట్టుబడులను ఇంజెక్ట్ చేస్తున్నారని తెలిపారు.
మరోవైపు ఎఫ్‌పీఐలు ఈక్విటీల నుండి తమ పెట్టుబడులను తిరిగి వెనక్కి తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో ఈక్విటీ పెట్టుబడులపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌ను పెంచుతున్నట్లు ప్రకటన రావడంతో ఇది మరింత ఎక్కువ అయింది. అలాగే అమెరికాలో నిరుద్యోగిత ఆందోళనలు, మాంద్యం భయాలు, వడ్డీ రేటు తగ్గింపుపై ప్రకటన వెలువడకపోవడంతో భారత స్టాక్‌లపై ఎఫ్‌పీఐలు అప్రమత్తంగా ఉన్నారని మార్కెట్ వర్గాలు తెలిపాయి.