భారత్‌పే బోర్డులోకి ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్!

ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ భారత్‌పే తన కార్యకలాపాల్లో గవర్నెన్స్, పారదర్శకతను బలోపేతం చేసేందుకు ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్

Update: 2022-09-13 12:57 GMT

న్యూఢిల్లీ: ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ భారత్‌పే తన కార్యకలాపాల్లో గవర్నెన్స్, పారదర్శకతను బలోపేతం చేసేందుకు ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ బి పి కనుంగో, జొమాటో ఛైర్మన్, స్వతంత్ర డైరెక్టర్ కౌశిక్ దత్తాలను స్వతంత్ర డైరెక్టర్లుగా నియమించింది. రాబోయే నెలల్లో కంపెనీ వ్యాపారం లాభదాయకంగా మారబోతోంది. దీనికోసం కంపెనీ గవర్నెన్స్‌ను మరింత పటిష్టం చేసేందుకు స్వతంత్ర డైరెక్టర్లను నియమిస్తున్నామని భారత్‌పే సీఈఓ సుహైల్ సమీర్ తెలిపారు. ప్రస్తుతం కంపెనీ బోర్డులో తొమ్మిది మంది డైరెక్టర్లు ఉండగా, కనీసం మూడింట ఒక వంతు స్వతంత్ర డైరెక్టర్లను కలిగి ఉండాలని చూస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

సమీర్‌తో పాటు సహ-వ్యవస్థాపకుడు శాశ్వత్ నక్రానీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా బోర్డులో ఉన్నారు. ఈ బోర్డుకు ఎస్‌బీఐ మాజీ ఛైర్మన్ రజనీష్ కుమార్ అధ్యక్షత వహిస్తున్నారు. మరో 2-3 ఏళ్లలో భారత్‌పే ఐపీఓకు వస్తుందని సుహైల్ చెప్పారు. ప్రపంచ స్థాయి సంస్థగా భారత్‌పేను నిలపాలని, స్టార్టప్ ప్రపంచంలో కార్పొరేట్ గవర్నెన్స్‌కు టార్చ్ బేరర్‌గా ఉండాలనే లక్ష్యంతో తాజా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాగా, బి పి కనుంగో ఇటీవలే ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా పదవీ విరమణ చేయగా, కౌశిక్ దత్తా ప్రస్తుతం జొమాటోలో ఛైర్మన్, స్వతంత్ర డైరెక్టర్‌గా ఉన్నారు. ప్రస్తుతం భారత్‌పే దేశవ్యాప్తంగా 400 నగరాల్లో సేవలందిస్తోంది.

Tags:    

Similar News