2027 నాటికి రూ. 25,240 కోట్లకు భారత గేమింగ్ పరిశ్రమ ఆదాయం!
భారత ఫాంటసీ గేమింగ్ పరిశ్రమ 2027 నాటికి రూ. 25,240 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగలదని ఓ నివేదిక అంచనా వేసింది.
న్యూఢిల్లీ: భారత ఫాంటసీ గేమింగ్ పరిశ్రమ 2027 నాటికి రూ. 25,240 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగలదని ఓ నివేదిక అంచనా వేసింది. గతేడాది వరకు పరిశ్రమ ఆదాయం రూ. 6,800 కోట్లుగా ఉంది. అలాగే, వినియోగదారుల సంఖ్య కూడా 2027 చివరి నాటికి 18 కోట్ల నుంచి 50 కోట్లకు పెరిగే అవకాశం ఉందని డెలాయిట్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్(ఎస్ఐఎఫ్ఎస్) మంగళవారం ప్రకటనలో తెలిపింది.
అంతేకాకుండా 2027 వరకు ఫాంటసీ గేమింగ్ పరిశ్రమ 30 శాతం వార్షిక వృద్ధి రేటును కలిగి ఉండనుంది. డిజిటల్ మౌలిక సదుపాయాలు పెరగడం, గేమింగ్ మార్కెట్ సంబంధిత అంశాలు మొత్తం పరిశ్రమ వృద్ధికి దోహదపడనున్నాయని నివేదిక వెల్లడించింది. ఇక, ప్రభుత్వం గేమింగ్ పరిశ్రమపై జీఎస్టీ విధింపునకు సంబంధించి స్పష్టత ఇచ్చిన తర్వాత మరింత వేగవంతమైన వృద్ధికి అవకాశం ఉంటుందని నివేదిక పేర్కొంది.