EV Market: అమెరికాకు చెందిన ఈవీ ఛార్జింగ్ కంపెనీని కొనుగోలు చేసిన దేశీయ ఎక్జికామ్
ఈవీ టెక్నాలజీ అభివృద్ధి చేసేందుకు ట్రిటియం డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ఉపయోగించనున్నట్టు ఎగ్జికామ్ ఎండీ చెప్పారు.
దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికాకు చెందిన డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కంపెనీ ట్రిటియమ్‌ను దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ సొల్యూషన్స్ సంస్థ ఎగ్జీకామ్ కొనుగోలు చేసింది. దీని విలువ సుమారు రూ. 310 కోట్లు అని కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. హైదరాబాద్‌లో కంపెనీ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోందని, ఈవీలకు అవసరమైన టెక్నాలజీ అభివృద్ధి చేసేందుకు ట్రిటియంకు చెందిన డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ఉపయోగించనున్నట్టు ఎగ్జికామ్ ఎండీ అనంత్ నహతా చెప్పారు. 2025 చివరి నాటికి ప్లాంటు అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ట్రిటియంతో జరిగిన ఒప్పందం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో కంపెనీకి ఉన్న సామర్థ్యాన్ని వినియోగిస్తాం. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా తమ కార్యకలాపాలను విస్తరిస్తామని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ట్రిటియంలో ఉన్న 300 మంది ఉద్యోగులు ఎగ్జికామ్ కంపెనీలో చేరనున్నారు. రానున్న రోజుల్లో ప్రపంచ స్థాయి ఈవీ సొల్యూషన్స్‌ను అందించే సామర్థ్యాన్ని బలోపేతం చేస్తామని కంపెనీ పేర్కొంది.