ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమలో ఏటా 98 శాతం పెరుగుతున్న ఉద్యోగుల సంఖ్య

ఆన్‌లైన్ గేమింగ్ రంగం దేశంలోని ఉపాధి కల్పనకు ప్రధాన సహకారం అందించనుంది.

Update: 2024-07-09 16:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: భారతదేశ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్ (ఏవీజీసీ) పరిశ్రమ 2026 నాటికి 68 శాతం వృద్ధిని సాధిస్తుందని ఓ అధ్యయనం అంచనా వేసింది. 'ఇండియాస్ బూమింగ్ ఆన్‌లైన్ గేమింగ్ ఇండస్ట్రీ: ఎ పొటెన్షియల్ పవర్‌హౌస్' పేరుతో ది ఫౌండేషన్ ఫర్ ఎకనామిక్ గ్రోత్ అండ్ వెల్ఫేర్ (ఈజీఆర్ఓడబ్ల్యూ ఫౌండేషన్), ప్రైమస్ పార్ట్‌నర్స్ సహకారంతో రూపొందించిన నివేదిక ప్రకారం, ఆన్‌లైన్ గేమింగ్ రంగం దేశంలోని ఉపాధి కల్పనకు ప్రధాన సహకారం అందించనుంది. ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమలో ఉద్యోగుల సంఖ్య 2018-2023 మధ్య ఏటా 97.5 శాతం పెరగడమే ఇందుకు నిదర్శనం. నివేదికలోని ప్రధాన అంశాల్లో.. మీడియా, వినోద పరిశ్రమకు ఆన్‌లైన్ గేమింగ్ రంగ సహకారం 2019లో 3.4 శాతం నుంచి 2024లో 10.5 శాతానికి, 2026 నాటికి 12.6 శాతానికి చేరనుంది. మొత్తం ఏవీజీసీ పరిశ్రమకు ఆన్‌లైన్ గేమింగ్ రంగ సహకారం 2019లో 41 శాతం నుంచి 2026 నాటికి 68 శాతానికి పెరగనుంది. పరిశ్రమలో శ్రామిక శక్తి పెరుగుదల 2018-2023 మధ్య 20 రెట్లు పెరిగింది. దేశంలో ఏవీజీసీ పరిశ్రమ వేగవంతమైన వృద్ధిపై స్పందించిన ఈజీఆర్ఓడబ్ల్యూ ఫౌండేషన్ సీఈఓ చరణ్ సింగ్.. ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ ఆర్థికవ్యవస్థకు అధిక సహకారం అందిస్తుంది. తద్వారా ఉపాధి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడం, ఇతర రంగాల్లోను ఉద్యోగావకాశలు పెంచడం వంటి సానుకూలతలు ఉన్నాయని పేర్కొన్నారు. 


Similar News