శాటిలైట్ సేవలు ప్రారంభించేందుకు అనుమతులు పొందనున్న స్టార్‌లింక్!
ప్రపంచ అత్యంత సంపన్నుడు ఎలన్ మస్క్ దేశీయంగా తన శాటిలైట్ ఇంటర్నెట్ సేవలైన స్టార్‌లింక్ కార్యకలాపాలను త్వరలో ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది
న్యూఢిల్లీ: ప్రపంచ అత్యంత సంపన్నుడు ఎలన్ మస్క్ దేశీయంగా తన శాటిలైట్ ఇంటర్నెట్ సేవలైన స్టార్‌లింక్ కార్యకలాపాలను త్వరలో ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇటీవల కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ నుంచి అవసరమైన అనుమతులు పొందనుంది. గతేడాది భద్రతా పరమైన కారణాలతో భారత్‌లో స్టార్‌లింక్ శాటిలైట్ సేవలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిలిపేసిన సంగతి తెలిసిందే.
శాటిలైట్ సేవల లైసెన్స్ ద్వారా గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ కోసం స్టార్‌లింక్ ప్రతిపాదనపై చర్చించడానికి ఈ నెలాఖరున మంత్రిత్వ శాఖ సమావేశం కానుంది. ఈ క్రమంలో టెలికాం శాఖ నుంచి అనుమతులు లభించవచ్చని సంబంధిత వ్యక్తులు తెలిపారు. ఒకవేళ ఈ అనుమతులు లభిస్తే, ఆ తర్వాత స్పేస్ మినిస్ట్రీతో పాటు ఇతర డిపార్ట్‌మెంట్ల వద్ద నుంది గ్రీన్ సిగ్నల్ అందుకోవాలి. అనంతరం దేశీయంగా స్టార్‌లింక్ తన కార్యకలాపాలను ప్రారంభించవచ్చు.
మరోవైపు ఎలన్ మస్క్ కంపెనీకి శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కోసం అనుమతుల ప్రక్రియ పూర్తయితే టెలికాం వ్యాపారంలో ఆధిపత్యం కొనసాగిస్తున్న రిలయన్స్ టెలికాం సేవల కంపెనీ జియోకు స్టార్‌లింక్ గట్టి పోటీనివ్వగలదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.