భారత్‌లోని రెండు కార్యాలయాలను మూసేసిన ట్విటర్!
ప్రపంచ బిలీయనీర్ ఎలన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు..
న్యూఢిల్లీ: ప్రపంచ బిలీయనీర్ ఎలన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతేడాది తాను సొంతం చేసుకున్న మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విటర్‌కు చెందిన రెండు భారత కార్యాలయాలను మూసేసినట్టు తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఆర్థిక రాజధాని ముంబైలలోని ఆఫీసులను మూసివేసి, ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని మెయిల్ ద్వారా కోరినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
బెంగళూరులో ఉన్నటువంటి కార్యాలయం మాత్రం యథావిధిగా కొనసాగనుంది. అందులో ఎక్కువమంది ఇంజనీర్లు విధులు నిర్వహిస్తున్నారు. గతేడాది చివర్లో దేశంలోని దాదాపు 200 మందికి సమానమైన ఉద్యోగుల్లో 90 శాతం మందిని తొలగించిన ట్విటర్, ఇప్పుడు కీలకమైన ఢిల్లీ, ముంబైలలోని ఆఫీసులను మూసేయడం గమనార్హం. ఈ ఏడాది చివరి నాటికి ట్విటర్‌ను ఆర్థికంగా పటిష్టం చేసే దిశగానే ఎలన్ మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
ఎలన్ మస్క్ ట్విటర్ కొన్న తర్వాత నుంచి కమర్షియల్ యాడ్స్ పడిపోవడంతో ఆదాయం భారీగా తగ్గిపోయింది. ఈ సవాళ్లను గట్టెక్కేందుకు ఎలన్ మస్క్ వివిధ చరలు తీసుకున్నారు. అందులో భాగంగానే ఉద్యోగుల సంఖ్యను సగానికి తగ్గించారు. ట్విటర్ సబ్‌స్క్రిప్షన్ కోసం ధరను నిర్ణయించడం, ఖర్చులు తగ్గించేందుకు సౌకర్యాలను పరిమితం చేయడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు.