Elon Musk: 400 బిలియన్ డాలర్ల సంపదతో ఎలన్ మస్క్ రికార్డు

ముఖ్యంగా టెస్లా, స్పేస్‌ఎక్స్ వాల్యుయేషన్‌లలో గణనీయమైన పెరుగుదల కారణంగా ఎలన్ మక్స్ ఈ మైలురాయికి చేరుకున్నారు.

Update: 2024-12-11 19:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: స్పేస్ఎక్స్, టెస్లా అధినేత ఎలన్ మస్క్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా 400 బిలియన్ డాలర్ల సంపదను అధిగమించిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. అతని కంపెనీలు ముఖ్యంగా టెస్లా, స్పేస్‌ఎక్స్ వాల్యుయేషన్‌లలో గణనీయమైన పెరుగుదల కారణంగా ఎలన్ మక్స్ ఈ మైలురాయికి చేరుకున్నారు. ఇటీవల వాటా విక్రయంతో పాటు అమెరికా ఎన్నికల ఫలితాల్లో తాను మద్దతిచ్చిన డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవడంతో ఎలన్ మస్క్ సంపదకు రెక్కలొచ్చాయి. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం, స్పేస్ఎక్స్ వాటా విక్రయం కారణంగా ఎలన్ మస్క్ సంపద 50 బిలియన్ డాలర్లు(రూ. 4.24 లక్షల కోట్లు) పెరిగింది. దీని కారణంగా ఎలన్ మస్క్ మొత్తం సంపద విలువ 439.2 బిలియన్ డాలర్ల(మన కరెన్సీలో రూ. 37.25 లక్షల కోట్ల)కు చేరుకుంది. 2022 ఏడాది చివర్లో ఎలన్ మస్క్ సంపద 200 బిలియన్ డాలర్ల కంటే తక్కువకు పడిపోయింది. ఆ తర్వాత క్రమంగా పెరిగినప్పటికీ గత నెలలో డొమాండ్ ట్రంప్ విజయంతో పాటు ట్రంప్ ప్రభుత్వంలో భాగం కావడం, అత్యంత ప్రభావవంతమైన దాతలలో ఒకడిగా మారడంతో ఆయన సంపద ర్యాలీ చేసింది. ట్రంప్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల క్రమబద్దీకరణతో ఇతర సానుకూల అంశాల కారణంగా అమెరికా ఎన్నికల ముందు నుంచి ఇప్పటివరకు టెస్లా షేర్లు 65 శాతం పెరిగాయని బ్లూమ్‌బర్గ్ తెలిపింది. అమెరికా ప్రభుత్వంలో గవర్నమెంట్ ఎఫిషియన్సీ విభాగానికి హెడ్‌గా ఎలన్ మస్క్ నియామకం ఖరారవడంతో ఈ పరిణామాలు ఎలన్ మస్క్ కంపెనీల షేర్లకు అత్యంత సానుకూల మద్దతిచ్చాయని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. 

Tags:    

Similar News