ఫిబ్రవరిలో 11 శాతం పెరిగిన దేశీయ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు
స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలు(SUV)లకు డిమాండ్ అధికంగా ఉండటం వలన ఫిబ్రవరి నెలలో దేశీయ ప్యాసింజర్ వాహన అమ్మకాలు సంవత్సరానికి 11 శాతం పెరిగాయని SIAM మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది
దిశ, బిజినెస్ బ్యూరో: స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలు(SUV)లకు డిమాండ్ అధికంగా ఉండటం వలన ఫిబ్రవరి నెలలో దేశీయ ప్యాసింజర్ వాహన అమ్మకాలు సంవత్సరానికి 11 శాతం పెరిగాయని SIAM మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 3.7 లక్షల యూనిట్ల అమ్మకాలు జరిగాయని ఇది 10.8 శాతం వృద్ధి అని SIAM డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ అన్నారు. ఫిబ్రవరి నెలలో డీలర్లకు మొత్తం 3,70,786 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను అందించగా, గత ఏడాది కాలంలో ఇది 3,34,790 యూనిట్లుగా ఉంది.
ద్విచక్ర వాహనాల విషయానికి వస్తే గత నెలలో అమ్మకాలు 35 శాతం పెరిగి 15,20,761 యూనిట్లకు చేరుకున్నాయి. ఇది గత ఏడాది ఫిబ్రవరి నెలలో 11,29,661 యూనిట్లుగా నమోదైంది. మూడు చక్రాల వాహనాల పంపిణీ గత ఏడాది ఫిబ్రవరిలో 50,382 యూనిట్లు కాగా, ఇప్పుడు అది 54,584 యూనిట్లకు పెరిగింది. పెరుగుతున్న ఆదాయ పరిస్థితులకు అనుగుణంగా వాహనాల అమ్మకాల్లో వృద్ధి కనిపిస్తుంది.
2023-24 మూడవ త్రైమాసికంలో దేశం మొత్తం బలమైన జీడీపీ వృద్ధి ఆటో రంగానికి సహాయపడింది. ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల వాహనాల అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే ఫిబ్రవరి 2024లో వృద్ధిని నమోదు చేశాయి, అయితే ఇదే సమయంలో వాణిజ్య వాహనాల అమ్మకాలు స్వల్పంగా క్షీణించినట్లు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) అధ్యక్షుడు వినోద్ అగర్వాల్ తెలిపారు.