Old vehicles: పాత వాహనాలతో కొత్త వాటిపై డిస్కౌంట్
కాలం చెల్లిన పాత వాహనాలు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో వాటిని మార్చుకుని కొత్త వాటిని కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త.
దిశ, బిజినెస్ బ్యూరో: కాలం చెల్లిన పాత వాహనాలు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో వాటిని మార్చుకుని కొత్త వాటిని కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. స్క్రాపేజ్ సర్టిఫికేట్ కలిగి ఉన్న పాత వాహనాలను తీసుకుని డిస్కౌంట్ ధరలో కొత్త వాటిని ఇచ్చే ప్రతిపాదనలకు వాణిజ్య, ప్యాసింజర్ వాహన తయారీదారులు ఒకే చెప్పారు. దీంతో ప్రజలు తమ పాత వాహనాలను ఇచ్చి డిస్కౌంట్‌లో కొత్త వాహనాలను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ నిర్ణయం వల్ల పాత వాహనాల వాడకం తగ్గిపోవడంతో పాటు, కాలుష్యాన్ని తగ్గించడానికి వీలవుతుంది.
రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, నా సిఫార్సుకు ప్రతిస్పందనగా వాణిజ్య, ప్రయాణీకుల వాహన తయారీదారులు చెల్లుబాటు అయ్యే స్క్రాపేజ్ సర్టిఫికెట్ ద్వారా కొత్త వాహనాల కొనుగోలుపై తగ్గింపు అందించడానికి అంగీకరించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ చర్య రోడ్లపై సురక్షితమైన, మరింత సమర్థవంతమైన వాహనాల వాడాకాన్ని ప్రోత్సహించేలా చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో సహాయ మంత్రులు హర్ష్ మల్హోత్రా, అజయ్ తమ్తా, మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ కూడా పాల్గొన్నారు.
సమాచారం ప్రకారం, మారుతీ సుజుకి, టాటా మోటార్స్, హ్యుందాయ్, కియా, టొయోటా, ఇతర ప్యాసింజర్ వాహన తయారీదారులు స్క్రాప్ చేయబడిన వాహనాలపై కొత్త కారు కొనుగోళ్లపై 1.5 శాతం తగ్గింపు లేదా రూ. 20,000, ఏది తక్కువైతే అది అందిస్తారు. మెర్సిడెస్ బెంజ్ ఇండియా రూ. 25,000 ఫ్లాట్ తగ్గింపు అందిస్తోంది. మరికొన్ని కంపెనీలు స్క్రాప్ చేయబడిన వాణిజ్య కార్గో వాహనాలకు ఎక్స్-షోరూమ్ ధరలో 3 శాతానికి సమానమైన డిస్కౌంట్లను అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా 3.5 టన్నులు. 3.5 టన్నుల లోపు వాహనాలకు 1.5 శాతం రాయితీ ఉంటుంది. తేలికైన వాణిజ్య వాహనాల కొనగోలుపై వరుసగా 2.75 శాతం, 1.25 శాతం తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి.
ఎన్ని ప్రయత్నాలు చేసినా స్వచ్ఛందంగా వాహనాలను స్క్రాపింగ్ చేయడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వం వాహనాల తయారీ దారులతో మాట్లాడి ఈ ప్రతిపాదనలకు ఒప్పించింది. 2025 మార్చి నాటికి 90,000 పాత ప్రభుత్వ వాహనాలను స్క్రాప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తాజాగా 60 రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ సెంటర్లు, 75 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.