2024లో ఐటీ కంపెనీల డిజిటల్ వ్యయం రూ.2 లక్షల కోట్లు!

క్లయింట్ల అవసరాలు, ఆప్టిమైజేషన్ ప్రాజెక్ట్‌ల ప్రాధాన్యత కారణంగా ఐటీ కంపెనీలు డిజిటల్ వినియోగంపై చేస్తున్న ఖర్చు భారీగా పెరుగుతుంది

Update: 2024-06-25 08:03 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: క్లయింట్ల అవసరాలు, ఆప్టిమైజేషన్ ప్రాజెక్ట్‌ల ప్రాధాన్యత కారణంగా ఐటీ కంపెనీలు డిజిటల్ వినియోగంపై చేస్తున్న ఖర్చు భారీగా పెరుగుతుంది. ఇటీవల విడుదలైన ఒక నివేదిక ప్రకారం, 2024లో ఐటీ కంపెనీల డిజిటల్ వ్యయం 13 శాతం పెరిగి రూ.2 లక్షల కోట్ల( $26 బిలియన్ల)కు చేరుతుందని అంచనా. ఇది మునుపటి సంవత్సరంలో కేవలం 5 శాతం వృద్ధితో $22.9 బిలియన్లకు పెరిగింది. ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) కంపెనీలు డిజిటల్ వ్యయంలో ఊహించిన దాని కంటే ఎక్కువ వ్యయాన్ని చేస్తున్నాయి. క్లయింట్లకు వేగంగా సేవలు అందించడానికి, అలాగే ప్రాజెక్ట్‌ అవసరాలకు అనుగుణంగా డిజిటల్ రంగం డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యంగా AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ను ఐటీ రంగం ఎక్కువగా స్వీకరిస్తుందని బిజినెస్ హెడ్-ఐటీ స్టాఫింగ్ కృష్ణ విజ్ అన్నారు.

పర్యాటకం, ప్రయాణం, రిటైల్, ఈ-కామర్స్, ఆటోమోటివ్ వంటి రంగాల్లోని వ్యాపారాల సామర్థ్యాన్ని పెంచడానికి, ఆప్టిమైజ్ చేయడానికి డిజిటల్ టెక్నాలజీలలో AI, క్లౌడ్-ఆధారిత పరిష్కారాలపై ఎక్కువగా పెట్టుబడులు ఉంటున్నాయి. ఒకవైపు, మేము ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాము, జాబ్ మార్కెట్లో మరిన్ని అవకాశాలను సృష్టిస్తున్నాము. దీనికనుగుణంగా సాంకేతిక జోక్యాన్ని కూడా తీసుకువస్తున్నారు. దీంతో అన్ని పనుల్లో ఆటోమేషన్ పెరిగిపోతుందని విజ్ చెప్పారు. ఐటీ కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు జనరేటివ్ AI‌ను మరింత వేగవంతం చేస్తున్నారని నివేదిక అభిప్రాయ పడింది.

AI, క్లౌడ్ కంప్యూటింగ్ వైపు మళ్లడం అనేది కేవలం కొత్త టెక్నాలజీలను అవలంబించడం మాత్రమే కాదు, నైపుణ్యం కలిగిన నిపుణుల కొరతను కూడా తీర్చాల్సిన అవసరం ఉందని, పరిశ్రమకు దాదాపు 6 లక్షల మంది నిపుణులు అవసరం కాగా, ప్రస్తుతం 4 లక్షల మంది ఉన్నారని, ఇది AI నిపుణులకు 51 శాతం డిమాండ్-సప్లై గ్యాప్‌ని సూచిస్తుందని డబ్లిన్-ప్రధాన కార్యాలయ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జూలీ స్వీట్ అన్నారు. ఐటీ కంపెనీలు సాంకేతికతపై పెట్టుబడి పెట్టడమే కాకుండా ఈ అంతరాన్ని తగ్గించడానికి నైపుణ్యం, శిక్షణ కార్యక్రమాలలో కూడా పెట్టుబడులు పెడుతున్నాయని, ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి అవసరమైన ప్రతిభను కలిగి ఉండేలా చూసుకోవాలని ఆమె అన్నారు.


Similar News